
హైదరాబాద్ సిటీలో న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా.. ఓ ఆన్ లైన్ యాప్ ద్వారా సన్ బర్న్ కార్యక్రమానికి సంబంధించి టికెట్ బుకింగ్ ఓపెన్ చేసిన నిర్వాహకులపై కేసుల పెట్టారు హైదరాబాద్ సిటీ పోలీసులు. ప్రైవేట్ యాప్ ద్వారా ఈవెంట్ కోసం బుకింగ్స్ పెట్టిన నిర్వాహకుడు సుమంత్ పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు మాదాపూర్ అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి.
సన్ బర్న్ ఈవెంట్స్ కు ఎలాంటి పర్మీషన్స్ ఇవ్వటం లేదని స్పష్టం చేస్తూనే.. అనధికారికంగా ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారాయన. అదే విధంగా న్యూఇయర్ వేడుకల కోసం అనుమతి తప్పనిసరి అని.. పర్మీషన్ తీసుకున్న తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఇల్లీగల్ వ్యవహారాలు చేసినా.. డ్రగ్స్ అమ్మినా.. గంజాయి కొట్టినా.. సన్ బర్న్ లాంటి కార్యక్రమాలు చేసినా.. యాక్షన్ సీరియస్ గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు అడిషనల్ డీసీపీ.
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సన్ బర్న్ ఈవెంట్ పై విచారణ చేయగా.. గతంలో ఇచ్చిన పర్మీషన్ ఆధారంగా టికెట్ బుకింగ్ పెట్టినట్లు తెలిసిందని.. విచారణ చేసి కేసు పెట్టామని.. అదే విధంగా నిర్వాహకులకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చినట్లు వివరించారాయన. మాదాపూర్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకల కోసం 22 దరఖాస్తులు వచ్చాయి.. అన్ని వసతులు, పోలీస్ నిబంధనలు అన్నీ ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత అనుమతులు ఇస్తామని.. ఆ తర్వాతే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయాలని.. పర్మీషన్ రాకముందే ఎలాంటి టికెట్లు అమ్మకూడదని నిర్వాహకులకు స్పష్టం చేశారు అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి.