పని గంటలు పెంచితే ప్రగతి పుంజుకుంటుందా? : మధు బుర్ర

పని గంటలు పెంచితే ప్రగతి పుంజుకుంటుందా?  : మధు బుర్ర

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్​లో ప్రొడక్టవిటీ చాలా తక్కువ.  పని ఉత్పాదకత అధికంగా ఉన్న దేశాలు అభివృద్ధిలో అగ్రపథాన నిలుస్తున్నాయి, మనం కూడా ఉత్పాదకత పెంచడానికి కృషి చేయాలి. భారత యువత ఈ మార్గంలో తమ శక్తిని వినియోగించాలి. రెండవ ప్రపంచయుద్ధం అనంతరం జర్మనీ, జపాన్‌‌లో కూడా ఉత్పాదకత పెంచుతూ వేగంగా అభివృద్ధి చెందాయి.

‘నా దేశ అభివృద్ధికి నేను కూడా వారానికి 70 గంటలు  పని చేస్తాను’ అని ఒక టీవీ ఇంటర్వ్యూలో ఇన్ఫోసిస్‌‌ నారాయణ మూర్తి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నారాయణ మూర్తి ప్రతిపాదించిన వారానికి 70 గంటల పని అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ, వ్యతిరేకిస్తూ పలు వేదికల్లో చర్చలు కొనసాగుతున్నాయి. పని చేస్తేనే జాతి ప్రగతి సుసాధ్యం అవుతుంది. 

భారత్​లో పని గంటలు అధికం

జపాన్‌‌, జర్మనీ లాంటి దేశాల సగటు పని గంటలతో పోల్చితే భారత్‌‌లో అధికంగా ఉంటున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. ఎన్ని గంటలు పని చేశామన్న విషయం కంటే ఆ సమయంలో ఎంత ఉత్పాదకత సాధించామన్నది ముఖ్యమైనదని గమనించాలి. ఒక గంట పనిలో జాతీయ ఉత్పాదకత ఎంత ఉంటున్నదనే విషయాన్ని గమనిస్తే..  భారతీయుల పని ఉత్పాదకతతో  పోల్చితే జపాన్​లో నాలుగు రెట్లు, జర్మనీలో ఏడు రెట్లు అధికంగా నమోదు అవుతున్నది. పని గంటలు పెంచడం కంటే అదే సమయంలో జాతీయ ఉత్పాదకత పెరిగే విధంగా యువత దృష్టి  కేంద్రీకరించాలి. 

యువశక్తి నిరర్థకం

భారతీయ యువత ఉన్నత విద్య పూర్తి చేసిన వెంటనే ఉద్యోగాలను కల్పిస్తే దేశ ఉత్పాదకత వేగంగా పెరుగుతుంది. నేటి యువత చదువులు పూర్తి కాగానే ఉద్యోగాల వేటలో దాదాపు 5 నుంచి 10 సంవత్సరాల వరకు నిరుద్యోగులుగా ఉండడం, ఉత్సాహవంతమైన యువశక్తి నిరర్థకం కావడం జరుగుతోంది. అర్హతకు తగిన ఉద్యోగాలు దొరక్క నేటి యువత నిరుత్సాహంగా తక్కువ స్థాయి ఉద్యోగాల్లో అయిష్టంగా గడపడంతో పని ఉత్పాదకత పడిపోతున్నది.

నిరుద్యోగ యువతలో 2 శాతం మందికి 30 ఏండ్లకు కూడా ఉద్యోగాలు దొరకడం లేదు. యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడడం, నిరుత్సాహపడడం జరుగుతోంది. 2018 వివరాల ప్రకారం బిహార్‌‌లో 90,000  రైల్వే ఉద్యోగాలకు 24 మిలియన్ల నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకున్నారు. తొలుత ఆకర్షణీయ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న యువత 30 ఏండ్ల వయస్సు దాటిన తరువాత తమకు అందుబాటులో ఉన్న చిన్న ఉద్యోగాల్లో అయిష్టంగా స్థిరపడుతూ అధిక పని ఉత్పాదకత నమోదు చేసుకోలేకపోతున్నారు.

మాన్యుఫాక్చరింగ్‌‌ విభాగంలో మన దేశ యువతకు అర్హతకు తగిన పనిని కల్పిస్తే దేశ సంపద 15 శాతం పెరుగుదలను నమోదు చేసేదని నిపుణులు వివరిస్తున్నారు. సెమీకండక్టర్స్‌‌, గ్రీన్‌‌ ఎనర్జీ రంగాల్లో దృష్టి సారిస్తూనే పర్యాటక, తోలు, వస్త్ర, ఆహార ఉత్పత్తి రంగాల్లో కూడా ఉత్పాదకత పెంచాల్సిన అవసరాన్ని గుర్తించాలి. 

పని గంటలు కాదు.. పని పూర్తి చేయాలి

ఐదు రోజుల పని దినాల ఉద్యోగాల్లో వారానికి 70 గంటలు పనిచేస్తే రోజుకు 14 గంటలు (6 రోజుల పని దినాల్లో 11.7 గంటలు) పని చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన ప్రభుత్వ కార్యాలయాల్లో 8 గంటల పనితో 6 రోజుల పని నిర్వహణతో  వారానికి 48 గంటలు మాత్రమే పని చేస్తున్నారు. మన కార్యాలయాల్లో రోజుకు 8 గంటలు పని చేసినా ఉత్పాదకత చాలా తక్కువగా ఉంటున్నది. ప్రైవేట్‌‌ కార్యాలయాల్లో పని గంటలు కనీసం 10 గంటలు ఉండడంతో 6 పని దినాల వారానికి 60 గంటలు పని చేయడం జరుగుతున్నది.

భారతీయ యువత విదేశాల్లో అధిక పని గంటలు, అధిక పని ఉత్పాదకతలను నమోదు చేస్తున్నారని మనకు తెలుసు.  భారత ప్రభుత్వ కార్మికశాఖ నియమాల ప్రకారం రోజుకు పని గంటలు 8 నుంచి 10 ఉంటూ, వారానికి 48 గంటలుగా నిర్ణయించబడింది. నిబంధనల ప్రకారం ఓవర్‌‌ టైమ్‌‌ను కలుపుకొని వారానికి 60 గంటలు మించకుండా చూడాలి. ప్రతి 4,- 5 గంటలకు ఒకసారి 30 నిమిషాల విశ్రాంతి లేదా ఇంటర్వెల్‌‌ ఉండాలని నిర్దేశించిన విషయాలు మనకు తెలుసు.   మన యువ భారతానికి కూడా  రోజుకు పని గంటలు 10 నుంచి 12 వరకు ఉండాలి. వారానికి 60 గంటలకు తగ్గకుండా సేవలు అందించాలి. ఉత్పాదకత పెంచేందుకు యువత సంకల్పించాలి.

మహిళా శక్తితో దేశాభివృద్ధి

1991 నుంచి నేటికి మన జనాభా 50 శాతం పెరిగినప్పటికీ జీడీపీ వృద్ధి 1991లో 350 బిలియన్ల నుంచి ప్రస్తుత 3.5 ట్రిలియన్లకు చేరుతూ 10 రెట్లు అధికంగా నమోదు అయ్యింది. ఉన్నత ఉద్యోగాల్లో చేరుతున్న ఉద్యోగుల సంఖ్య అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అధికంగా ఉంటున్నది.  వ్యవసాయ రంగం నుంచి ఆధునిక మాన్యుఫాక్చరింగ్‌‌ రంగానికి శ్రమ జీవులు మారడం గమనిస్తున్నాం. భారత శ్రామిక వర్గాలు 50 శాతం వరకు వ్యవసాయంతో పాటు అనుబంధ అసంఘటిత రంగాల్లో పని చేయడంతో దేశాభివృద్ధి మందగిస్తున్నట్లు తెలుస్తున్నది.

నేడు భారత మహిళల శక్తిని 25 శాతం వరకు మాత్రమే వినియోగిస్తున్నాం. ఐఎంఏ అంచనాల ప్రకారం భారతీయ మహిళాశక్తిని 50 శాతం వినియోగించుకున్నట్లైతే దేశాభివృద్ధి 33 శాతం పెరుగుతుందని తెలుస్తున్నది.

పురుషులతో సమానంగా మహిళా శక్తిని వినియోగించినపుడు దేశాభివృద్ధి 60 శాతం వరకు పెరుగుతుందని వివరిస్తున్నారు. మహిళల్లో  నైపుణ్యాలను పెంచడం, కుటుంబ భారాన్ని బట్టి పని గంటలను నిర్ణయించడం, గృహాలకు సమీపంలో ఉద్యోగాలు కల్పించడం లాంటి చర్యలను తీసుకున్నట్లైతే అభివృద్ధిలో మహిళలు అర్ధభాగం అవుతారని తెలుస్తున్నది. 

 – డాక్టర్​ మధు బుర్ర