
తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో లెక్కలేనన్ని కుంభకోణాలకు పాల్పడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కేసీఆర్ ప్రభుత్వం చేసిన పాపాల పుట్టలు పగిలి ప్రజల ఎదుటకు రావడానికి కేసీఆర్‌కు ముఖం చెల్లడం లేదు. బీఆర్‌ఎస్ పాలనలో అవినీతి ప్రజలకు పూర్తిగా అర్థమైంది.
కుంభకోణాలు, అవినీతిపై విచారణలు తుది దశకు చేరడంతో బీఆర్‌ఎస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇంకోవైపు కేసీఆర్ కుమార్తె పార్టీపై తిరుగుబాటు లేవనెత్తడంతో కేసీఆర్ పరిస్థితి మరింత దిగజారిపోయింది. దీంతో పార్టీ ఉనికినికాపాడుకోవటానికి బీఆర్‌ఎస్‌కు బనకచర్ల అంశం అవకాశంగా కనిపించింది. కాబట్టి ఈ అంశంపై ఆంధ్రా-,తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడానికి కేసీఆర్ అండ్ కో కుట్రలకు తెరలేపారు.
2014లో తెలంగాణకు కేసీఆర్, ఆంధ్రాకు చంద్రబాబు ముఖ్యమంత్రులయ్యారు. అప్పట్లో చంద్రబాబుతో ఉప్పు నిప్పుగా కేసీఆర్ వ్యవహరించారు. 2019లో జగన్ ఎన్నికల్లో గెలవటానికి కేసీఆర్ అన్నివిధాలుగా సహకరించారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమించి, రాష్ట్రాన్ని విడదీయొద్దని ఊరూ వాడా తిరిగి రాష్ట్రపతికి వినతిపత్రాలిచ్చిన జగన్‌ను కేసీఆర్ అక్కున చేర్చుకున్నారు.
జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ వెళ్లి అక్కడ ప్రసంగించారు. ఆ తరువాత కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ను ఆహ్వానించడానికి అమరావతి వెళ్లిన కేసీఆర్.. ట్రైబ్యునళ్లు, కోర్టుల్లో కేసులు ఉపసంహరించుకుందామని, గోదావరి, కృష్ణా వాటాలను పూర్తిగా వినియోగించుకుందామని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇద్దరూ కలిసి విందు భోజనం చేశారు.
బనకచర్ల ఆలోచన కేసీఆర్‌దే
ఆరోజు గోదావరి నీటిని కృష్ణాకు తరలించి రాయలసీమను సస్యశ్యామలం చేయాలని పిలుపునిచ్చి, ఈరోజు అధికారం పోయేటప్పటికీ ఆంధ్రావాళ్లు నీళ్లు తరలించుకుపోతున్నారంటూ బీఆర్‌ఎస్ నాయకులు రోడ్డెక్కి గగ్గోలు పెడుతున్నారు. ఆంధ్రాకు వెళ్లి రోజా ఇంట్లో రొయ్యల పులుసు భోజనం చేసి రాయలసీమను రతనాల సీమ చేయాలని చెప్పి, ఈరోజు నాలుక మడతవేసి ఆంధ్రా వాళ్లు గోదావరి నీళ్లు తీసుకెళితే తెలంగాణకు నష్టమంటూ గగ్గోలు పెడుతున్నారు.
నాడు 299 టీఎంసీలకే ఒప్పుకొని..
2016లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్ర బాబు నీటిపారుదలశాఖ మంత్రులు దేవినేని, హరీష్‌రావులు పాల్గొన్నారు. ఈ సందర్బంలో మా వాటాగా 299 టీఎంసీలు కృష్ణా జలాలు ఉన్నాయి. వాటికి లోబడి ప్రాజెక్టులు నిర్మించుకుంటామని అప్పటి కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతిని కేసీఆర్ కోరారు.
గోదావరి నుంచి 3వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు వెయ్యి టీఎంసీలు అవసరం, గోదావరి నుంచి కృష్ణాకు నీళ్లు తరలించి ఉపయోగించుకోవచ్చునని ఆరోజు కేసీఆర్ సూచించారు. దీంతో ఆనాడే, గోదావరి నీళ్లు రాయలసీమకు తరలించటానికి పునాది పడింది.
రాష్ట్ర ప్రభుత్వ ఫిర్యాదుతో నిలిచిన బనకచర్ల
ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పోలవరం-–బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏవిధంగా వ్యవహరించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా, అన్ని పార్టీల నుంచి ఎంపీలు దీనికి హాజరై సలహాలు, సూచనలు ఇచ్చారు.
మరుసటిరోజే సీఎం ఢిల్లీ వెళ్లి నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి బనకచర్లపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజుబులిటీ రిపోర్టును తిరస్కరించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ ప్రాజెక్టు విషయంలో గోదావరి జలాల వివాద ట్రిబ్యునల్-1980 జిడబ్ల్యూడీటీ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014కు విరుద్ధంగా ఏపీ వ్యవహరిస్తోందని తెలిపారు.
గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా ఇతర జలవివాదాలపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులం కూర్చొని మాట్లాడుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను నిరాకరించింది. తాము అధికారంలో ఉన్న పదేళ్లు కళ్లుమూసుకుని కూర్చున్న మామ అల్లుళ్లు.. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదుతో కేంద్రం అనుమతి నిరాకరిస్తే అది తమ ఘనతేనంటూ చాటింపు వేసుకుంటున్నారు.
కేసీఆర్ పాపాలు
బీఆర్‌ఎస్ పాలనలో ఒక్కసారైనా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు. ఏ రాజకీయ పార్టీ అభిప్రాయం తెలుసుకోకుండా కేసీఆర్ కృష్ణా-, గోదావరి జలాలను ఆంధ్రాకు ధారాదత్తం చేశారు. రాష్ట్రం తన జాగీరు అయినట్లు, తానే ఒక పెద్ద ఇంజినీర్ అయినట్లు కేసీఆర్ భావించి ఆరోజు ఆంధ్రాకు నీటిని ధారాదత్తం చేస్తూ సంతకం పెట్టారు.
2015లో కృష్ణా జలాల విషయంలో ఆంధ్రాకు 66శాతం, తెలంగాణకు 34శాతం నీటి కేటాయింపులకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒప్పుకున్నది. కృష్ణా జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు 299టీఎంసీలకు ఒప్పుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కృష్ణా నీళ్లలో 66-–34 నిష్పత్తిలో ఆంధ్రా, తెలంగాణకు నీటి వాటాలు దక్కుతున్నాయి.
గత ఫిబ్రవరిలో కృష్ణా రివర్ బోర్డు మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశంలో తెలంగాణకు 71శాతం, ఆంధ్రాకు 29శాతం నీళ్లు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డును కోరగా వారు అందుకు తిరస్కరించారు. ఇదేగాక,
శ్రీరాంసాగర్ నుంచి లిఫ్ట్ ద్వారా మహారాష్ట్ర నీళ్లు తీసుకెళితే తమకు అభ్యంతరం లేదని కేసీఆర్ మహారాష్ట్రకు వరాన్ని ప్రసాదించారు. ఇప్పటికే ఎగువన మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు కట్టడంతో శ్రీరాంసాగర్‌కు నీళ్లు రావడం తగ్గిపోయింది. నాడు కేసీఆర్ చేసిన పాపాలు నేటికీ రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉన్నాయి.
మళ్లీ సెంటిమెంట్ రాజేసే పన్నాగం
తెలంగాణ రాకతో సెంటిమెంట్ అనే అస్త్రం కేసీఆర్ చేతినుంచి దూరమైంది. అయినా, ఏదో రూపంలో ఆంధ్రా బూచి చూపించి మళ్లీ పోయిన ప్రజాదరణను రాబట్టుకోవటానికి కేసీఆర్ శతవిధాల ప్రయత్నిస్తున్నారు. నీటిని అడ్డంపెట్టుకొని సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి రాజకీయం చేయడం కేసీఆర్‌కు కొత్తకాదు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్‌కు ఓడిపోతాననే భయం పట్టుకున్నది.
సెంటిమెంట్ అస్త్రాన్ని కేసీఆర్ బయటకు తీశారు. తన మిత్రుడు, దత్త పుత్రుడైన జగన్‌తో కలిసి నీళ్ల మంటను రగిలించటానికి ప్రయత్నించారు. . ఒంగోలు చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో డ్యామ్‌పై బారికేడ్లు, ఇనుప కంచెతో అడ్డుగోడ కట్టి కుడి కాల్వ నుంచి 2వేల క్యూసెక్కుల నీటిని ఏపీకి తరలించుకు వెళ్లారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలను పగులగొట్టారు.
ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లపై దాడికి దిగారు. ఈవిధంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు రగిల్చి ఆంధ్రా బూచి చూపించి ఎన్నికల్లో గెలవటానికి కేసీఆర్ పథక రచన చేశారు. కానీ, తెలంగాణ ప్రజలు విజ్ఞులు. కుట్రలు, కుతంత్రాల మాయలో వారు పడలేదు. దీంతో కేసీఆర్ పన్నిన పన్నాగం ఫలించలేదు.
జగన్‌తో అలయ్ బలయ్
కేసీఆర్ ప్రగతి భవన్‌కు జగన్‌ను పిలిపించి అలయ్ బలయ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ నదుల్లో నీటి లభ్యతపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘గోదావరి, కృష్ణా నదుల్లో కలిసి 4వేల టీఎంసీల నీటి లభ్యత ఉంది. నీళ్ల కోసం ట్రైబ్యునళ్ల చుట్టూ, కోర్టుల చుట్టూ, మరొకరి చుట్టూ తిరగడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు.
కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువ ఉన్నందున, గోదావరి నది నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లకు నీటిని తరలించి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, పాలమూరు, నల్గొండ జిల్లాల నీటి గోస తీరుతుంది’ అని కేసీఆర్ ఈ సమావేశంలో ప్రతిపాదించారు.
- మేడిపల్లి సత్యం,చొప్పదండి శాసనసభ్యుడు