
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులు జైలుకు వెళ్ళడం దురదృష్టకరమని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం రచించిన దాలి, చేదు నిజం పుస్తకాలను ఆవిష్కరణ సభకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. చేదు నిజం పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం మధు యాష్కీ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.
చిన్నతనం నుంచే కేసీఆర్ ది దొంగ చరిత్ర అని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో నోట్లు.. సీట్ల కోసమే కేసీఆర్ పని చేశాడని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలీసుల నిధుల ఫైలుపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి అప్పటి నుంచే ఉద్యమకారులను అణిచివేయడం మొదలుపెట్టారని మండిపడ్డారు. పోలీసులు ప్రస్తుతం అధికార పార్టీ గుండాలుగా మారారని అన్నారు.
పోడు భూమల కోసం చిన్న పిల్లలు, మహిళలపై పాశవికంగా దాడులు జరిగితే.. తెలంగాణ సమాజం ఎందుకు మౌనంగా ఉంటుందో అర్థం కాలేదని మధుయాష్కీ వాపోయారు. రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానన్న సీఎం.. కాటేసే నక్కల మారాడని అన్నారు. కవులు, కళాకారులు మాట్లాడకుండా సంఘం పెట్టి వారికి అధ్యక్షుడిగా పార్టీ ఎమ్మెల్యేని పెట్టి గొంతు మూయిస్తున్నాడని విమర్శించారు. కేసీఆర్ కు అధికారం కోసం సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వలేదని, ప్రజల అభివృద్ధి కోసం ఇచ్చారని అన్నారు. ప్రొఫెసర్ పురుషోత్తం లాంటి బుద్దిజీవులు కేసీఆర్ ను గద్దె దించేందుకు కలసి రావాలని మధుయాష్కీ పిలుపునిచ్చారు.
మంత్రి కేటీఆర్ శ్రీకాంత చారిని పప్పు చారు అని అవమానిస్తున్న దుర్మార్గుడని మధుయాష్కీ మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన తరువాత కొంత మంది కవులు, కళాకారులు తమ గొంతు మూసుకొని పదవులను అనుభవిస్తున్నారని ఆరోపించారు. శ్రీలంకలో వచ్చిన ప్రజా పోరాటం రాష్ట్రంలోనూ వచ్చి కుటుంబపాలన అంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. గడీల పాలన అంతం చేసేందుకు అందరు ముందుకు రావాలని మధుయాష్కీ గౌడ్ పిలుపునిచ్చారు.