ఇంటర్ బోర్డు నిధులపైనా శ్వేతపత్రం రిలీజ్​చేయండి : మధుసూదన్ రెడ్డి

ఇంటర్ బోర్డు నిధులపైనా శ్వేతపత్రం రిలీజ్​చేయండి : మధుసూదన్ రెడ్డి
  • సీఎం రేవంత్ రెడ్డికి ఇంటర్ విద్యా జేఏసీ విజ్ఞప్తి  

హైదరాబాద్, వెలుగు :  ఇంటర్మీడియెట్ బోర్డు నిధులను గత బీఆర్ఎస్ సర్కారు దుర్వినియోగం చేసిందని, దీనిపైనా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గత పదేండ్లలో బోర్డుకు వచ్చిన నిధులు, చేసిన ఖర్చుపై సమగ్రంగా విచారణ చేయించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బుధవారం నాంపల్లిలో మీడియాతో ఆయన మాట్లాడారు.

 కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కొత్త ప్రభుత్వం గత సర్కారు చేసిన అప్పులపై అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేసింది. కానీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థల నుంచి గత సర్కారు లాక్కున్న నిధులపైనా విచారణ చేయించాలి. ఇంటర్ బోర్డుకు సంబంధించిన సుమారు రూ.150 కోట్ల ఎఫ్​డీలను విత్ డ్రా చేయించి, గత ప్రభుత్వం గుంజుకున్నది. పాఠ్యపుస్తకాలకు నిధులు ఇవ్వకుండా, రూ.52 కోట్ల బోర్డు నిధులను దారి మళ్లించింది’’ అని మధుసూదన్ రెడ్డి ఆరోపించారు.

 ఇంటర్ బోర్డు నిధులను కేవలం పరీక్షల నిర్వహణ, సెంటర్లలో వసతులు, కరికులమ్ డెవలప్ మెంట్ కు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉందని, దీనికి విరుద్ధంగా గత సర్కారు ఇష్టానుసారంగా బోర్డు నిధులను దుర్వినియోగం చేసిందన్నారు. కాలేజీల్లో భవనాలు, టాయ్ లెట్ల నిర్మాణంతో పాటు చివరికి చిన్నచిన్న రిపేర్లకూ రూ.50 కోట్ల బోర్డు నిధులను ఇచ్చారని విమర్శించారు.

 కమిషనరేట్ ఆఫీసులో క్యాంటీన్ నిర్మాణానికి, లిఫ్ట్ కు కూడా బోర్డు నిధులను ఇవ్వడం దారుణమన్నారు. మరోవైపు 2023 మార్చితో పాటు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ, స్పాట్ వాల్యువేషన్ లో పాల్గొన్న ఉద్యోగులు, లెక్చరర్లకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వలేదన్నారు. నిధులు ఇవ్వకున్నా.. ఉచిత విద్య అందించామని బీఆర్ఎస్ సర్కారు బోగస్ ప్రచారం చేసుకున్నదని ఫైర్ అయ్యారు.