కుట్రలో భాగంగానే మధుసూదన్‌‌‌‌రెడ్డి అరెస్ట్

కుట్రలో భాగంగానే మధుసూదన్‌‌‌‌రెడ్డి అరెస్ట్
  •     బీఆర్ఎస్​ నేతలే టార్గెట్‌‌‌‌గా కాంగ్రెస్​ రాజకీయాలు
  •     సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​ రావు ఫైర్‌

రామచంద్రాపురం, వెలుగు : పటాన్‌‌‌‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌‌‌‌రెడ్డి సోదరుడి అరెస్ట్‌‌‌‌ కుట్రపూరితమని, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లే లక్ష్యంగా కాంగ్రెస్​రాజకీయాలు చేస్తోందని  సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయడమే కాంగ్రెస్​సర్కారు లక్ష్యంగా కనిపిస్తోందని, అందుకే బీఆర్ఎస్​ నేతలపై అక్రమ కేసులు పెడ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా న్యాయమే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్‌‌‌‌ కేసులో ఎమ్మెల్యే మహిపాల్‌‌‌‌రెడ్డి తమ్ముడి అరెస్ట్‌‌‌‌ను తెలుసుకున్న ఆయన పటాన్‌‌‌‌చెరు పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌కు చేరుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. జిల్లాకు చెందిన మంత్రి ఆదేశాలతోనే అక్రమ అరెస్ట్‌‌‌‌లు చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజామున తీసుకెళ్లడం అప్రజాస్వామికమని, స్టేషన్‌‌‌‌ బెయిల్​ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వకుండా చేశారన్నారు. కాంగ్రెస్​లీడర్లకు చెందిన క్వారీలను వదిలేసి, కేవలం బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లనే టార్గెట్‌‌‌‌ చేయడం వెనుక మంత్రి హస్తముందన్నారు. ‘కాంగ్రెస్‌‌‌‌లో చేరకుంటే అక్రమ కేసుల నమోదు’ అనేలా ఆ పార్టీ వంద రోజుల పాలన ఉందని ఎద్దేవా చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మహిపాల్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, పదేళ్లలో ఎవరి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. పూర్తి పర్మిషన్లతో మైనింగ్ నడిపిస్తున్నామని, తప్పు చేస్తే శిక్ష విధించాలన్నారు. కాంగ్రెస్​ బెదిరింపులకు భయపడేది లేదని, ఏదైనా కోర్టులో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌‌‌‌ రావు, కొత్త ప్రభాకర్‌‌‌‌రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, జడ్పీ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ మంజుశ్రీ పాల్గొన్నారు.