
ఇటీవల విడుదలైన రజనీకాంత్ 'కూలీ' బాక్సాఫీస్ వద్ద కొనసాగోతోంది. అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డును సృష్టించింది. అయితే ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది.ఈ సినిమా పెద్దలకు మాత్రమే .. మైనర్లకు సరికాదని అని తెలిపింది. దీంతో దీన్ని సవాలు చేస్తూ నిర్మాత సంస్థ సన్ పిక్చర్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టులో వారికి చుక్కెదురైంది. వారి పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.
'కూలీ' సినిమాకు 'యు/ఎ' సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతూ ఇటీవల సన్ పిక్చర్స్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది . ఈ చిత్రంలో మద్యం సేవించడం, అసభ్యకరమైన భాషను ఉపయోగించిన సన్నివేశాలను తొలగించినప్పటికీ, CBFC ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వడం సరికాదని సన్ పిక్చర్స్ సీనియర్ కౌన్సిల్ జె. రవీంద్రన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే, CBFC తరపున వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఏ.ఆర్.ఎల్. సుందరేశన్.. ఈ చిత్రంలోని అధిక హింస దృష్ట్యా 'ఎ' రేటింగ్ సరైనదేనని సమర్థించారు. CBFC యొక్క ఎగ్జామినింగ్ , రివైజింగ్ కమిటీలు ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకున్నాయని ఆయన పేర్కొన్నారు.
'యు/ఎ' సర్టిఫికెట్ కావాలనుకుంటే, సినిమాను సమర్పించే ముందే అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించి ఉండాల్సిందని బోర్డు వాదించింది. దీంతో బోర్డు వాదనలతో ఏకిభవించిన కోర్టు సన్ పిక్చర్స్ అప్పీల్‌ను తిరస్కరించింది. ఈ సినిమాలో హింసాత్మక సన్నివేశాలు మైనర్లకు సరికాదని పేర్కొంటూ వారి పిటిషన్‌ను జస్టిస్ టీవీ తమిళసెల్వి కొట్టివేశారు. ఈ పిటిషన్‌లో ఎలాంటి అర్హత లేదని ఆమె స్పష్టం చేశారు. సన్ పిక్చర్స్ అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది
'కూలీ' చిత్రం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జున అక్కినేని, అమీర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక మాజీ కూలీ యూనియన్ లీడర్ తన స్నేహితుడి మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడమే ఈ చిత్ర కథాంశం. ఈ క్రమంలో అతను ఒక పెద్ద నేర సామ్రాజ్యంతో తలపడతాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
విమర్శకుల నుంచి మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ, నటీనటుల నటన, సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ప్రశంసలు దక్కాయి. కథ, స్క్రీన్‌ప్లేపై మాత్రం కొంత విమర్శ వచ్చింది. అయినా, ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా, ఆల్‌టైమ్ నాలుగవ అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ విజయం, వివాదాలు కూలీ చిత్రం గురించి ఇంకా చర్చ జరిగేలా చేస్తున్నాయి.