తమిళనాడు ఆలయాల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం..హైకోర్టు ఉత్తర్వులు

తమిళనాడు ఆలయాల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం..హైకోర్టు ఉత్తర్వులు

తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో మొబైల్ ఫోన్లపై మద్రాస్ హైకోర్టు నిషేధం విధించింది. ఈ నిర్ణయం ప్రార్థనా స్థలాల పవిత్రతను కాపాడటానికి ఉపయోగపడుతుందని అని కోర్టు పేర్కొంది. అంతేకాదు ఆల‌యాల్లో భ‌క్తుల‌కు డ్రెస్ కోడ్ త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని కూడా తెలిపింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మొబైల్‌ ఫోన్లను భద్రపరిచే లాకర్లు ఏర్పాటుచేయాలని సూచించింది. ఈ ఉత్తర్వులను పాటించేలా భద్రతా సిబ్బందిని కూడా నియమించాలని తెలిపింది.  

తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామి ఆలయంలో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. మొబైల్ ఫోన్‌లతో  దేవతా చిత్రాలను క్లిక్ చేయడం ఆగమ నిబంధనలను ఉల్లంఘించడమేనని పిటిషనర్ వాదించారు. అయితే కోర్టు ఆదేశాలతో నవంబర్ 14 నుంచే ఆలయంలో సెల్‌ఫోన్‌లు వినియోగించకుండా ఆంక్షలు విధించినట్లు తిరుచెందూర్ ఆలయ ఈవో తెలిపారు. సెల్ఫోన్ల వినియోగాన్ని పర్యవేక్షించేందుకు స్వయం సహాయక బృందాలను నియమించేందుకు కూడా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. 

తిరుచెందూర్ దేవస్థానంలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధిస్తూ చర్యలు తీసుకున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. రాష్ట్రవ్యాప్తంగా ఇతర దేవాలయాల స్వచ్ఛత, పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించింది.