వినూత్నంగా విమానంలో ఎగురుతూ పెళ్లి

వినూత్నంగా విమానంలో ఎగురుతూ పెళ్లి
  • లాక్ డౌన్ దెబ్బతో వినూత్నంగా ఆకాశంలో పెళ్లి
  • మాంగళ్యధారణ తర్వాత మధురై అమ్మవారి గుడిచుట్టూ విమానం ప్రదక్షిణలు
  • లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో విచారణకు ఆదేశించిన డీజీసీఏ

కరోనా లాక్ డౌన్ దెబ్బతో పెళ్లిళ్లు చాలా వరకు సింపుల్ గానూ.. మరికొన్ని విచిత్రంగానూ.. జరుగుతున్నాయి. బంధు మిత్రులందరి సమక్షంలో అట్టహాసంగా పెళ్లి చేసుకునే అవకాశం కాదు కదా.. కనీసం అటు పాతిక.. ఇటు పాతిక మంది మించకుండా పెళ్లిళ్లు చేసుకోవాలనే నిబంధన కొద్ది మందికి రుచించడం లేదు. అయితే కొంత మంది మాత్రం ఇదే అవకాశంగా చేసుకుని వినూత్న తరహాలో పెళ్లిళ్లు చేసుకుని తమ జీవితంలో మరపురాని ఘట్టంగా పదిలపరచుకుంటుండడం చూస్తున్నాం. అయితే తమిళనాడులోని మధురైకి చెందిన ఓ జంట వినూత్నంగా ఆలోచించి.. భూమి మీద చేసుకుంటే కరోనా నిబంధనలు పాటించాల్సి వస్తుందని వెరైటీగా చార్టెర్డ్ ఫ్లయిట్ లో పెళ్లి చేసుకున్నారు. 161 మంది బంధుమిత్రుల సమక్షంలో ఎగురుతున్న విమానంలో వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. మాంగళ్యధారణ పూర్తయిన వెంటనే అదే విమానంలో మధురై మీనాక్షి అమ్మవారి గుడి చుట్టూ విమానంతోనే ప్రదక్షిణలు చేశారు. అయితే కరోనా నిబంధనలు పాటించకపోవడం వివాదాస్పదంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర విమానయానశాఖ విచారణకు ఆదేశించడంతో గుట్టుగా జరిగిన పెళ్లి హాట్ టాపిక్ అయింది. 
మధురైకు చెందిన రాకేష్, దక్షిణ అనే జంటకు పెళ్లి నిశ్చయం అయింది. బంధు మిత్రులందరి సమక్షంలో అట్టహాసంగా పెళ్లి జరుపుకుందామంటే లాక్ డౌన్ వచ్చి పడింది. దీనికి తోడు కరోనా నిబంధనలతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలన్నకల నెరవేరని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎలాగైనా వినూత్నంగా చేయాలని ఆలోచించి మధురై నుంచి బెంగళూరుకు విమానాన్ని బుక్ చేసుకున్నారు. ఇరువైపులా కుటుంబ సభ్యులందరితోపాటు బంధుమిత్రులందరినీ కలుపుకుంటే 161 మంది అయ్యారు. దీంతో మొత్తం టికెట్లను బుక్ చేసుకుని విమానం ఆకాశం లోకి ఎగురుతున్న సమయంలో పెళ్లి చేసుకున్నారు. ఆకాశంలో విమానం చక్కర్లు కొడుతుండగా పండితుడి మంత్రోచ్చారణల మధ్య పెళ్లి కొడుకు రాకేష్ పెళ్లి కూతురు దక్షిణ మెడలో తాళి కట్టాడు. మాంగళ్య ధారణ పూర్తయిన వెంటనే మధురై మీనాక్షి అమ్మవారి గుడి చుట్టూ విమానంతోనే చక్కర్లు కొట్టించి వారు ఏడడుగులు నడిచారు.
ఆ తర్వాత విమానం బెంగళూరు నుండి మధురైకు తిరిగి చేరుకుంది. ఈ పెళ్లి తంతు కాస్త వెరైటీగా జరగడంతో వధూ వరులే కాదు.. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు సంబరపడిపోయారు. అంతేకాదు విమానంలో పెళ్లి తంతు ఫోటోలు, వీడియోలు బంధు మిత్రులు, కుటుంబ సభ్యులకు షేర్ చేసిన కాసేటికే వైరల్ అయ్యాయి. ఒకవైపు లాక్ డౌన్ ఉండగా విమానంలో ఎలాంటి సోషల్ డిస్టెన్స్ పాటించకుండా.. అంతేకాదు మాస్కులు కూడా ధరించకుండా గుంపులు గుంపులుగా గుమిగూడి పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.  ఈ పెళ్ళికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లిలో కరోనా మార్గదర్శకాల అమలు ఎక్కడా కనిపించలేదని తెలియడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది.

విమానంలో అతిథులు క్రిక్కిరిసి ఉండగా, వధూవరులకు మాస్కుల్లేకుండానే కనిపించడాన్ని డీజీసీఏ తప్పుబట్టింది. కరోనా నిబంధనలు పాటించకుండా ఇలాంటి కార్యక్రమాలకు ఎలా అనుమతిచ్చారని విచారణకు ఆదేశించింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ స్పైస్ జెట్, ఎయిర్ పోర్ట్ వర్గాలకు ఆదేశాలిచ్చింది. ఆ విమానంలో ఏం జరిగిందన్నది వెంటనే రిపోర్టు చేయకుండా మిన్నకుండిపోయినందుకు తీవ్ర క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణిస్తూ  స్పైస్ జెట్ సిబ్బందిని వెంటనే విధుల నుంచి తప్పించారు. వ్యవహారం  కలకలం రేపడంతో స్పైస్ జెట్ యాజమాన్యం స్పందించింది. నిబంధనలు పాటించకుండా విమానం ఎక్కిన పెళ్లి బృందంపై లిఖితపూర్వకంగా  ఫిర్యాదు చేయడానికి  స్పైస్ జెట్ సిద్ధమవుతోంది.