- భద్రాచలం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శివనాయక్
భద్రాచలం,వెలుగు : తాత్కాలికంగా మత్తు కల్గించే ఆనందం కన్నా జీవితంలో ఉన్నతస్థాయిలో ఉన్నప్పుడు సమాజం మనకు ఇచ్చే ఆనందం కోటిరెట్లు గొప్పదని భద్రాచలం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పి.శివనాయక్ విద్యార్థులకు సూచించారు. భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గురువారం జిల్లా న్యాయ సేవలు ప్రాధికార సంస్థ నిర్వహించిన మత్తు మందుల అవగాహన, న్యాయ అవగాహన, ఆరోగ్య సంక్షేమ మార్గ నిర్ధేశపథకంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకుని ఈనెల 5 నుంచి 12 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో మత్తు పదార్ధాల వాడకం, ఎదురయ్యే అనర్ధాలపై విపులంగా వివరించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డాక్టర్ కె.జాన్మిల్టన్, భద్రాచలం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దుర్గ భవానీ, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు దేవదానం, శిశు, సంక్షేమ అధికారి రూప తదితరులు పాల్గొన్నారు.
