కోడెమొక్కుల ఎములాడ రాజన్న

కోడెమొక్కుల ఎములాడ రాజన్న

మహాశివరాత్రి... పరమశివుడికి చాలా ఇష్టమైన రోజు. శివపార్వతులు ఈరోజే పెండ్లి చేసుకున్నారని పురాణాలు చెప్తున్నాయి. శివుడు ఈరోజే లింగం ఆకారంలో కనిపించాడని శివపురాణంలో ఉంది. అందుకే ఈ రోజు భక్తులు ఉపవాసం ఉండి,  పూజలు చేసి లయకారుడి అనుగ్రహం పొందాలని అనుకుంటారు. శివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న గుడికి వెళ్తుంటారు చాలామంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది వేములవాడ.  దీనికి ‘దక్షిణ కాశి’ అని పేరుంది.‘కోడె మొక్కుల స్వామి’గా పేరొందిన వేములవాడ రాజన్న ప్రత్యేకతలివి. 

ఆదిగురువైన శివుడు వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు.  వేములవాడ చాళుక్యుల కాలం నాటిది ఈ గుడి. ఒకటో నరసింహ బిరుదు అయిన ‘రాజాదిత్య’ పేరు  మీద ఈగుడికి ‘రాజరాజేశ్వర దేవాలయం’ అని పేరొచ్చిందని చెప్తారు. 8 నుంచి 10వ శతాబ్దం కాలంలో ఒక చిన్న బండరాయి మీద ఈ ఆలయాన్ని కట్టించారు. గర్భగుడిని పూర్తిగా నల్ల చలువరాయితో కట్టారు. స్తంభాలు, పై కప్పు మీద చెక్కిన శిల్పాలు  ఒకప్పటి శిల్పకళని కళ్లకు కడతాయి. ఈ ఆలయ గోపురం దక్షిణాది శిల్ప కళకి నిదర్శనం. గర్భగుడికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. మూల విరాట్టుకు కుడివైపు శ్రీ రాజరాజేశ్వరి దేవి, ఎడమ వైపు శ్రీ లక్ష్మీ సహిత సిద్ది వినాయక విగ్రహాలు ఉంటాయి. ప్రధాన ఆలయంలో అనంతపద్మనాభస్వామి, శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాలు ఉంటాయి. ఈ రెండు వైష్ణవ ఆలయాలు ఉండడం వల్ల రాజన్న గుడికి ‘దక్షిణ కాశి’ అని పేరొచ్చింది. భక్తులు ధర్మ గుండంలో మునిగిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు. శివరాత్రి, కార్తీకమాసం రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువ. గుడి ఆవరణ శివనామ స్మరణతో మారుమోగిపోతుంది. ఈ టైమ్​లోనే మూడు రోజులు జాతర జరుగుతుంది.  

కోడె మొక్కుల దేవుడు
ఎములాడ రాజన్నకు ‘కోడె మొక్కుల దేవుడి’గా పేరుంది. గుడి చుట్టూ కోడెల్ని తిప్పితే అనుకున్నది జరుగుతుందని భక్తుల నమ్మకం. విశేషం ఏమంటే... కోడె మొక్కుల సంప్రదాయం రాజన్న గుడిలో తప్ప మరెక్కడా కనిపించదు. అంతేకాదు రాజన్నకు పుట్టు వెంట్రుకలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.  
ఎములాడకు వెళ్లిన వాళ్లు రాజన్న గుడికి దగ్గర్లో ఉన్న బద్ది పోచమ్మ అమ్మవారిని కూడా దర్శించుకుంటారు.11వ శతాబ్దానికి చెందిన వేములవాడ భీమ కవి ఈ ప్రాంతానికి చెందినవాడే.  

ఇలా వెళ్లాలి
రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 12 కిలో మీటర్లు జర్నీ చేస్తే వేములవాడకి చేరు కోవచ్చు. హైదరాబాద్​ నుంచి 180 కిలో మీటర్ల జర్నీ. కరీంనగర్​ నుంచి వేముల వాడకు 35 కిలోమీటర్ల జర్నీ. అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది. 

టైమింగ్స్​: ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు. భక్తులు బస చేయడానికి  ఎసి, నాన్​ ఎసి రూమ్స్​ కిరాయికి దొరుకుతాయి.