మహా శివరాత్రి స్పెషల్ : తెలంగాణలో ప్రముఖ శివుడి ఆలయాలు ఇవే..

మహా శివరాత్రి స్పెషల్ : తెలంగాణలో ప్రముఖ శివుడి ఆలయాలు ఇవే..

మహాశివుడికి ఎంతో ఇష్టమైన రోజు మహా శివరాత్రి. అందుకే భక్తులు ఆ రోజంతా శివ నామాన్ని స్మరిస్తారు. రాత్రంతా జాగారం చేస్తారు. భోళా శంకరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాసం ఉంటారు. భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అన్ని శైవ క్షేత్రాల్లో అంగరంగ వైభవంగా ఉత్సవాలు చేస్తారు. తెలంగాణలో ఎన్నో శైవ క్షేత్రాలు ఉన్నాయి. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం.

కొమురవెల్లి మల్లన్న

ఈ క్షేత్రం సిద్దిపేట జిల్లాలో ఉంది. ఇక్కడ శివరాత్రి రోజు వైభవంగా ఉత్సవాలు చేస్తారు. ఈ ఆలయంలోని మల్లికార్జునస్వామి విగ్రహాన్ని 'పుట్టమన్ను'తో చేశారు. అది కూడా 500 సంవత్సరాల క్రితం. అయినా నేటికీ చెక్కుచెదరలేదు. అంతేకాదు స్వామి విగ్రహంలో నాభి వద్ద 'పుట్టు లింగం' ఉందని భక్తులు చెప్తుంటారు. యాదవుల ఆడపడచు 'గొల్ల కేతమ్మ'ను, లింగ బలిజల ఆడపడచు 'బలిజ మేడమ్మ'ను మల్లన్నస్వామి పెళ్లి చేసుకున్నారు.

అందుకే స్వామికి రెండు వైపులా.. గొల్ల కేతమ్మ, బలిజ మేడమ్మ విగ్రహాలు ప్రతిష్ఠించారు' అని భక్తులు చెప్తుంటారు. ఇక్కడ ఏటా సంక్రాంతితో మొదలయ్యే ఉత్సవాలు ఉగాది వరకూ సాగుతాయి. అందులో భాగంగా నిర్వహించే 'పట్నంవారం' ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఆలయంలో శివరాత్రి రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు.

కీసర గుట్ట

ఇది హైదరాబాదుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రామలింగేశ్వర స్వామి భవానీసమేతుడై కొలువుదీరాడు. ఈ క్షేత్రం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. శ్రీరాముడు, సీత, ఆంజనేయుడు పరవశించి పోయి శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అనుకున్నారు. అందుకోసం శ్రీరాముడు వారణాసి నుంచి లింగాన్ని తీసుకురమ్మని ఆంజనేయుడికి చెప్పాడు.

అయితే ఆంజనేయుడు సరైన లింగాన్ని ఎంచుకోలేక 101శివ లింగాలను తీసుకొచ్చాడు. కానీ అప్పటికే ముహూర్తం మించిపోవడంతో స్వయంగా శివుడే ప్రత్యక్షమై లింగాన్ని రాముడికి ఇచ్చాడు. హనుమంతుడు వచ్చే సరికి లింగ ప్రతిష్ఠ పూర్తయింది. తాను తెచ్చిన లింగాలను ప్రతిష్ఠించలేదనే కోపంతో లింగాలన్నింటినీ విసిరివేశాడు ఆంజనేయుడు. దాంతో కీసర గుట్ట పరిసరాల్లో లింగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి' అని చెప్తున్నారు భక్తులు. అందుకే ఇప్పటికీ ఈ ప్రాంతంలో చాలా శివ లింగాలు కనిపిస్తుంటాయి.

కాళేశ్వర

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండటం కాళేశ్వరాలయం ప్రత్యేకత. పురాణాల్లో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. ఆలయంలో మొదట కాళేశ్వరుడిని (యముడు) పూజించి తర్వాత ముక్తేశ్వరుడిని (శివుడు) పూజిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ‘ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులందరికీ స్వామి ముక్తిని ప్రసాదించడంతో అందరి పాపాలు తొలగిపోయి యముడికి పని లేకుండా పోయిందట. దాంతో యముడు శివుడితో మొరపెట్టుకుంటాడు.

అప్పడు శివుడు యముడిని కూడా లింగాకారంలో తన పక్కనే కొలువుదీరమని చెప్పాడు. లింగాకారంలో ఉన్న యముడిని పూజించకుండా వెళ్లేవాళ్లకు ముక్తి దొరకదు. అలాంటి వాళ్లను యముడు నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడ'ని భక్తులు చెప్తుంటారు. మరో విశేషం ఏంటంటే.. ఇక్కడి లింగంలో రెండు రంధ్రాలుంటాయి. వీటిలో నీటిని పోస్తే ఆలయానికి దగ్గరలో ఉన్న గోదావరి, ప్రాణహిత సంగమంలో కలుస్తాయట.

వేములవాడ రాజన్న

తెలంగాణలో ఎంతో పేరుగాంచిన శైవక్షేత్రం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది. ఇక్కడ శివుడు శ్రీరాజరాజేశ్వరుడిగా కొలువుదీరాడు. 'వృత్రాసురుని చంపిన ఇంద్రుడు బ్రహ్మహత్యాదోషాన్ని నివారించుకునేందుకు అనేక పుణ్యక్షేత్రాలను దర్శించాడు. అయినా ఆయనకు దోష నివారణ కాకపోవడంతో బృహస్పతి సూచనతో రాజేశ్వరక్షేత్రాన్ని దర్శించుకున్నాడు. దాంతో వెంటనే దోష నివారణ జరిగింద'ని భక్తులు చెప్తుంటారు. వేములవాడలో రాజరాజేశ్వరీ అమ్మవారి, కాశీ విశ్వేశ్వర, కోదండ రామ, ఉమా మహేశ్వర, బాలా త్రిపురసుందరీ దేవి, బాల రాజేశ్వర, విఠలేశ్వర, సోమేశ్వర, భీమేశ్వర, కనకదుర్గ, మహాలక్ష్మి ఆలయాలు, బద్ది పోచమ్మ ఆలయాలు కూడా ఉన్నాయి.