బీజేపీకి షాకిచ్చిన మహా వికాస్ ఆగాధి కూటమి

బీజేపీకి షాకిచ్చిన మహా వికాస్ ఆగాధి కూటమి

ముంబైఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశామన్న బీజేపీకి మహా వికాస్ ఆగాధి కూటమి గట్టి షాకిచ్చింది. ఫడ్నవీస్​ బలపరీక్షపై మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో శరద్​ పవార్​, ఉద్ధవ్​ థాక్రే, సోనియా గాంధీ అత్యంత వ్యూహాత్మకంగా తమ ఎమ్మెల్యేలతో సోమవారం రాత్రి పరేడ్ చేయించారు. ముంబైలోని గ్రాండ్ హయత్​ హోటల్​లో జరిగిన కార్యక్రమానికి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్​కు చెందిన మొత్తం 162 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గంటన్నరపాటు సాగిన ఈవెంట్​లో.. మూడు పార్టీల ఎమ్మెల్యేలు, నేతలు.. కూటమిగానే కొనసాగుతామని, బీజేపీని అడ్డుకుని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం జరిగినంతసేపూ ఆ ప్రాంగణమంతా ‘‘లాంగ్​ లివ్​ మహా వికాస్​ ఆగాధి”నినాదాలతో మారుమోగిపోయింది. ఎమ్మెల్యేలను ఉద్దేశించి శివసేన చీఫ్ ఉద్ధవ్​ థాక్రే, ఎన్సీపీ చీప్​ శరద్​ పవార్​, మహారాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇన్​చార్జి మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. మూడు పార్టీల ఎంపీలు, ఇతర కీలక నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇది మారాఠా గడ్డ.. జాగ్రత్త: పవార్​

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పవర్​ను మిస్​యూజ్​ చేయడం బాగా అలవాటైందని ఎన్సీపీ చీఫ్ శరద్​ పవార్ మండిపడ్డారు. పరేడ్​లో కూటమి ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘గతంలో కర్నాటక, గోవా, మణిపూర్​లోనూ బీజేపీ అడ్డదారిలో అధికారాన్ని చేపట్టింది. మరాఠా గడ్డమీద మాత్రం వాళ్ల ఆటలు సాగబోవు. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో 162 మంది ఎమ్మెల్యేల మెజార్టీ బలం మనకే ఉంది. అతి త్వరలోనే మనం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నాం. ఫ్లోర్​ టెస్టులో ఈజీగా గెలుస్తాం. మీ162 మందిని అసెంబ్లీకి తీసుకెళ్లే బాధ్యత నాది’’అని భరోసా ఇచ్చారు. పార్టీ నుంచి సస్పెండ్​ అయిన ఒక వ్యక్తి చెప్పే మాటల్ని ఎవరూ పట్టించుకోవద్దంటూ పరోక్షంగా అజిత్​ పవార్​ ను ఉద్దేశించి శరద్​ పవార్​ కామెంట్​ చేశారు.

ఇప్పటికైనా ఫడ్నవీస్​ తప్పుకోవాలి: థోరాట్​

గ్రాండ్​ హయత్​ హోటల్​లో కూటమి ఎమ్మెల్యేల సంఖ్య చూసిన తర్వాతైనా సీఎం పోస్టు నుంచఫడ్నవీస్​తప్పుకోవాలని మహారాష్ట్ర పీసీసీ చీఫ్​ బాలాసాహెబ్​ థోరాట్​ అన్నారు. ‘‘మహా వికాస్ అగాది కూటమి మొదటి మీటింగే ఇంత గ్రాండ్​గా జరిగింది. వచ్చే ఐదేండ్లు ఇదే ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తా” అని చెప్పారు. మహారాష్ట్ర విషయంలో ఎంతవరకైనా పోరాడుదామని పార్టీ నేతలకు సోనియా నిర్దేశించినట్లు ఏఐసీసీసీ వర్గాలు తెలిపాయి.