మహిళతో అటెండర్ అసభ్య ప్రవర్తన..మహబూబాబాద్ కలెక్టరేట్లోనే అతడికి దేహశుద్ధి

మహిళతో అటెండర్ అసభ్య ప్రవర్తన..మహబూబాబాద్ కలెక్టరేట్లోనే అతడికి దేహశుద్ధి

మహబూబాబాద్, వెలుగు: ఓ మహిళతో అసభ్యంగా వ్యవహరించిన కలెక్టరేట్​లో పనిచేసే అటెండర్​కు ఆమె కుటుంబసభ్యులు దేహశుద్ధి చేశారు. మహబూబాబాద్ కలెక్టరేట్​లోని రెవెన్యూ విభాగంలో మురళి అనే వ్యక్తి అటెండర్ గా పనిచేస్తున్నాడు. మహబూబాబాద్ మండలం పర్వతగిరికి చెందిన ఓ మహిళ గ్రామంలో రోడ్డు నిర్మాణంలో కొంత భూమిని కోల్పోయింది. 

అప్పటి నుంచి భూ పరిహారం కోసం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతోంది. ఆమెను కొంతకాలంగా గమనిస్తున్న మురళి బుధవారం ఆమె కలెక్టరేట్​కు రావడంతో అదునుగా చూసి అసభ్యంగా ప్రవర్తించాడు. 

దీంతో బాధిత మహిళ ఫోన్​లో విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో కొద్దిసేపటికి వారు కలెక్టరేట్​కు చేరుకొని మురళిని చితకబాదారు. అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. మురళిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సదరు మహిళ మీడియాకు తెలిపారు.