బైపాస్ ఎక్కాలంటేనే..భయం.. భయం..ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్తో వస్తున్న బైకులు, కార్లు

బైపాస్ ఎక్కాలంటేనే..భయం.. భయం..ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్తో వస్తున్న బైకులు, కార్లు
  • రాత్రిళ్లు బైక్​ రేసులు పెట్టుకుంటున్న యువకులు
  • రెండు వారాల్లో మూడు ఘోర ప్రమాదాలు, 9 మంది మృతి
  • స్మోకర్లు, డ్రింకర్లకు అడ్డాగా బైపాస్​ ఏరియాలు

మహబూబ్​నగర్, వెలుగు:మహబూబ్​నగర్​లో ట్రాఫిక్​ సమస్యకు చెక్​ పెట్టేందుకు ఏర్పాటు చేసిన బైపాస్​ రోడ్లు డేంజర్​ జోన్లుగా మారుతున్నాయి. తరచూ ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.

ర్యాష్​ డ్రైవింగ్, ఓవర్​ స్పీడ్, నిర్లక్ష్యపు డ్రైవింగే ఇందుకు కారణమని స్పష్టమవుతోంది. నెల రోజుల్లోనే నగరంలోని రెండు బైపాస్​ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రెగ్యులర్​గా ప్రమాదాలు జరుగుతున్నా.. సంబంధిత అధికారులు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. 

ఎవరు ఎటు నుంచి వస్తూ పోతున్నరో తెలియని పరిస్థితి..

పాల్కొండ బైపాస్​ ఎస్​వీఎస్​ హాస్పిటల్​ దగ్గర నుంచి ప్రారంభమై మహబూబ్​నగర్–భూత్పూర్​ రోడ్డుకు కలుస్తుంది. దాదాపు 10 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు విస్తరించింది. అయితే ఈ మార్గంలో లారీలు, జీపులు, కార్లు, ప్రైవేట్​ ట్రావెల్స్, బైకులు ఓవర్​ స్పీడ్​తో వస్తుంటాయి.

ప్రధానంగా పిస్తా హౌస్, ఎదిర క్రాస్​ రోడ్డు వద్ద ఏ బండి ఎటు వైపు నుంచి ఎటు వైపు వస్తుందో తెలియని పరిస్థితి. ఈ రెండు ప్రాంతాల్లో నాలుగు కూడళ్ల రోడ్డు ఉండడంతో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్​ బ్రేకర్లు కూడా లేవు. బారికేడ్లు ఏర్పాటు చేసినా ఫలితం ఉండడం లేదు. పైగా పిస్తా హౌస్​ వద్ద వందల కొద్దీ వాహనాలు రోడ్డుపైనే నిలిపివేయడంతో ట్రాఫిక్​ సమస్య ఏర్పడుతోంది. దీంతో రాత్రిళ్లు ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటేనే స్థానికులు భయపడుతున్నారు. 

ఓపెన్​ కాక ముందే యాక్సిడెంట్లు

మహబూబ్​నగర్–​-చించోలి హైవేను కలుపుతూ నగరంలో కొత్తగా బై పాస్​ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బైపాస్​ పనులు ఇంకా పూర్తి కాలేదు. కొంత భాగం మిలిగి ఉంది. అయితే వాహనదారులు మాత్రం ఈ మార్గంలో ప్రయాణాలు చేస్తున్నారు. కర్నాటక, హైదరాబాద్​ తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు.. ఈ మార్గంలో  120 నుంచి 140 కిలోమీటర్ల స్పీడ్​లో వెళ్తున్నాయి. ఇటీవల ఈ మార్గంలో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి.

కొద్ది రోజుల కిందట వీరన్నపేట బైపాస్​ నుంచి జీప్​ యూ టర్న్​ తీసుకుంటుండగా.. అటు వైపు నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో నగరానికి చెందిన ఓ వ్యక్తి చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ప్రాంతంలో రెండు వారాల కింద ఆటోను జీపు ఢీకొట్టడంతో ముగ్గురు స్పాట్​లోనే చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు.

వేగ నియంత్రణ ఏదీ?

తాజాగా పాల్కొండ బైపాస్​ వద్ద జరిగిన ప్రమాదంలో రేసింగ్​ బైక్​ మితిమీరిన వేగంతో వచ్చి కారును ఢీకొనడంతో ఐదుగురు స్పాట్​లోనే చనిపోయారు. అయితే బైపాస్​ల పొంటి వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్​ లిమిట్​ బోర్డులు, స్పీడ్​ కెమెరాలు, స్పీడ్​ గన్స్, అవసరమైన చోట రంబుల్​ ట్రిప్స్​​​ఏర్పాటు చేయాల్సి ఉంది. జంక్షన్లు, కూడళ్ల వద్ద ప్రత్యేక లైట్లు, మలుపులు, గ్రామ ప్రదేశాలు, స్కూల్​ జోన్ల వద్ద రిఫ్లెక్టివ్​ స్ట్రిక్కర్లు, స్లో డౌన్, యాక్సిడెంట్​ జోన్​ వంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. అలాగే ప్రతి కూడలి వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ట్రాఫిక్​ రూల్స్​ను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. 

రాత్రి ఒంటి  గంట వరకు  ఓపెన్..​

పాలకొండ బైపాస్​ పక్కన హోటళ్లు, చాయ్​ దుకాణాలు రాత్రి ఒంటి గంట వరకు తెరిచే ఉంటున్నాయి. దీంతో నగరానికి చెందిన యువత పెద్ద మొత్తంలో ఈ ప్రాంతానికి చేరుకొని టైం పాస్​ చేస్తున్నారు. రాత్రి 9 దాటాకా.. బైక్​లు వేసుకొని బైపాస్​ ఎక్కుతున్నారు. సైలెన్సర్ల నుంచి భయంకరమైన శబ్దాలు చేస్తూ బైక్​ రేసింగ్​లు పెట్టుకుంటున్నారు.

మరికొందరు అక్కడక్కడా ఉన్న కల్వర్టుల వద్ద కూర్చొని సిగరెట్లు తాగుతూ వచ్చి పోయే వారిని ఇబ్బంది పెడుతున్నారు. ఇంకొందరు బైపాస్​ వెంట ఏర్పాటు చేసిన రియల్  ఎస్టేట్​ వెంచర్లను సిట్టింగుల కోసం వినియోగించుకుంటున్నారు.

గత కొంత కాలంగా ఈ వ్యవహారం నడుస్తున్నా.. చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేయడం లేదని అంటున్నారు. రాత్రిళ్లు పెట్రోలింగ్​ జరుగుతున్నా నామ్​కే వాస్తేగా జరుగుతున్నాయనే విమర్శలున్నాయి.