
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా మహబూబ్‌నగర్ జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్న బి.పాపిరెడ్డి నియమితులయ్యారు. హైకోర్టు సిఫారసుల ఆధారంగా ఆయనను న్యాయశాఖ కార్యదర్శిగా నియమిస్తున్నట్లు పేర్కొంటుూ సీఎస్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పాపిరెడ్డి.. మేడ్చల్ జిల్లా దబిల్‌పూర్‌లో 1976 ఆగస్టు 28న జన్మించారు.
మేడ్చల్‌లో పాఠశాల విద్య, ఇంటర్మీడియెట్ పూర్తి చేశారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో బీకాం, పడాల రామిరెడ్డి కాలేజీ నుంచి లా పట్టా పొందారు. 2012లో జిల్లా జడ్జిగా ఎంపికై 2013లో నెల్లూరులో బాధ్యతలు చేపట్టారు. నెల్లూరు, కృష్ణ, విశాఖపట్టణం, హైదరాబాద్, మెదక్‌తోపాటు నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా 2022 నుంచి 2023 దాకా పనిచేశారు. 2023 ఏప్రిల్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.