లోన్‌‌‌‌ కట్టలేదని ఇంటి తలుపులు ఎత్తుకెళ్లిన బ్యాంకు అధికారులు

లోన్‌‌‌‌ కట్టలేదని ఇంటి తలుపులు ఎత్తుకెళ్లిన బ్యాంకు అధికారులు

గూడూరు, వెలుగు: తండ్రి తీసుకున్న లోన్‌‌‌‌ కట్టలేదని కొడుకు ఇంటి తలుపులను బ్యాంకు అధికారులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మదనాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన గుగులోతు మోహన్ నాయక్ 2020లో వ్యవసాయ పెట్టుబడి కోసం గూడూరు డీసీసీ (డిస్ట్రిక్ట్‌‌‌‌ కోఆపరేటివ్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌) బ్యాంక్‌‌‌‌లో రూ.4.4 లక్షలు మార్ట్‌‌‌‌గేజ్ లోన్ తీసుకున్నాడు. అప్పు తీసుకున్న తర్వాత మోహన్ నాయక్‌‌‌‌ అనారోగ్యానికి పాలై మంచానికే పరిమితమయ్యాడు. దీంతో తండ్రి తీసుకున్న అప్పు మొదటి కిస్తీ రూ.60 వేలు కొడుకు వీరేందర్ చెల్లించాడు.

మిగతా డబ్బులు వెంటనే కట్టాలని బ్యాంక్‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌ డిస్ట్రిక్ట్‌‌‌‌ ఆఫీసర్లతో కలిసి బుధవారం వీరేందర్‌‌‌‌‌‌‌‌ ఇంటి వద్ద నానా హంగామా చేశాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న వీరేందర్‌‌‌‌‌‌‌‌ భార్య స్వరూప కొద్ది రోజులు టైమ్‌‌‌‌ ఇవ్వాలని, మిగతా డబ్బులు కట్టేస్తామని బతిమిలాడినా మేనేజర్‌‌‌‌‌‌‌‌ వినిపించుకోలేదు. ఇంట్లో ఉన్న విలువైన సామాన్లను తీసుకెళ్తుండగా, ఆమె అడ్డుకుంది. లోన్‌‌‌‌ కట్టకపోతే, ఆస్తిని జప్తు చేస్తామని బెదిరించి, ఇంటికున్న రెండు తలుపులను ఊడదీసి తీసుకెళ్లారు. ఇదంతా బ్యాంకు ఆఫీసర్లకు సెక్యూరిటీగా వెళ్లిన పోలీసుల సమక్షంలోనే జరిగింది. అయితే, తీసుకెళ్లిన ఇంటి తలుపులు ఏం చేయాలో అర్థంక కాక, రెండు గంటల తర్వాత సిబ్బందిని పంపించి, తీసిన చోటే పెట్టించారు. నోటీసులు ఇవ్వకుండానే బ్యాంక్‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌ తమ ఇంటిపై దౌర్జన్యం చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వీరేందర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.