
- మహబుబాబాద్ లో డాక్టర్ల నిర్లక్షంతో పేషెంట్ మృతి
- ఆందోళనకు ప్రయత్నించిన బంధువులపై సెక్యూరిటీ దాడి
మహబూబాబాద్అర్భన్, వెలుగు : చనిపోయిన వ్యక్తిని డిశ్చార్జి చేశాడో డాక్టర్. అయితే దీన్ని గుర్తించిన బంధువులు ఆందోళన చేయగా, వారిపైకి సెక్యూరిటీని ఉసిగొల్పి దాడి చేయించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో గురువారం జరిగింది. బాధితుడి కుటుంబసభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యదేవిపల్లి గ్రామానికి చెందిన ఏర్పుల యాకయ్య (38) తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఈ నెల 22న జిల్లా దవాఖానాకు వచ్చాడు. దీంతో అతడిని అడ్మిట్ చేసుకుని చికిత్స ప్రారంభించారు. గురువారం ఉదయం 11:30 గంటల నుంచి యాకయ్య కదలడం మానేశాడు. పడుకున్నాడనుకుని కొద్దిసేపటి వరకు వెంట ఉన్న భార్య అతడిని డిస్ట్రబ్ చేయలేదు. కానీ గంటకు పైగా అలాగే ఉండడంతో అనుమానం వచ్చి లేపడానికి ప్రయత్నించగా లేవలేదు. మధ్యాహ్నం నర్సు ఇంజక్షన్ ఇవ్వడానికి రాగా విషయం చెప్పారు.
దీంతో నర్సు డాక్టర్‌కు సమాచారం ఇచ్చింది. డాక్టర్ వచ్చి చెకప్ చేయాలని చెప్పి బంధువులను బయటకు పంపించివేశాడు. తర్వాత డిశ్చార్జి కార్డు రాసిచ్చాడు. బంధువులు లోపలకు వచ్చి అసలు కదలకుండా ఉంటే డిశ్చార్జి రాయడం ఏమిటని ప్రశ్నించారు. ఆందోళన చేసేందుకు ప్రయత్నించగా వేరే డాక్టర్లు వచ్చి పరీక్షించి చనిపోయాడని కన్ఫమ్ చేశారు. దీంతో నిరసనకు దిగిన బంధువులపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేసి బయటకు పంపించారు. దీంతో బాధితులంతా కలిసి మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కంప్లయింట్ చేశారు. కేసయితే బాడీకి పోస్ట్‌మార్టం చేయాల్సి వస్తుందని, అటూ ఇటూ తిరగాల్సిరావడం, ఇతర ఇబ్బందులు ఉంటాయని భావించి డెడ్‌బాడీని తీసుకుని వెళ్లిపోయారు. డాక్టర్లను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఎవరూ అందుబాటులోకి రాలేదు.