అనాథ చిన్నారులకు స్పోర్ట్ డ్రెస్‌ల అందజేత

అనాథ చిన్నారులకు స్పోర్ట్ డ్రెస్‌ల అందజేత

మహబూబ్ నగర్, (నారాయణ పేట)వెలుగు: నారాయణపేట జిల్లా కేంద్రంలోని సుభాష్ రోడ్ వద్ద గల బాలసదనం చిన్నారులకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం స్పోర్ట్స్ డ్రెస్ లను అందజేశారు. సదనంలోని మొత్తం 48 మంది చిన్నారులకు కలెక్టర్ తన నిధులతో స్పోర్ట్స్ డ్రెస్ లను,  చెస్, క్యారమ్,  షటిల్, రింగ్ బాల్ ఆట వస్తువులను అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌‌తో కలిసి పంపిణీ చేశారు. స్పోర్ట్స్ బూట్లను కూడా తెప్పించాలని నిర్వాహకులకు సూచించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్  చిన్నారులతో ముచ్చటించారు. బాగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. చిన్నారులకు కరాటే శిక్షణ ఇప్పించాలని, కూచిపూడి నృత్యం నేర్పించాలని డీసీపీఓ కరిష్మాను ఆదేశించారు. అనంతరం సదనం పక్కనే ఉన్న వయోవృద్ధుల ఆశ్రమంలో ఉన్న ఏడుగురు వృద్ధులకు చీరలను పంపిణీ చేసి వారి ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.