ఎయిర్పోర్ట్ టెర్మినల్ తరహాలో.. పాలమూరు రైల్వే స్టేషన్

ఎయిర్పోర్ట్  టెర్మినల్ తరహాలో.. పాలమూరు రైల్వే స్టేషన్
  • అమృత్​ భారత్​ రైల్వే స్టేషన్​ ఆధునీకరణ స్కీమ్​కు ఎంపిక
  • రూ.40 కోట్లతో కొత్త బిల్డింగుల నిర్మాణం
  • ఎనిమిది నెలల్లో పనులు పూర్తి చేయాలని డెడ్​లైన్​

మహబూబ్​నగర్, వెలుగు: వందేళ్ల చరిత్ర ఉన్న మహబూబ్​నగర్​ రైల్వే స్టేషన్​ కొత్త రూపు సంతరించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అమృత్​ భారత్  రైల్వే స్టేషన్  ఆధునీకరణ’​ స్కీమ్​కు ఈ స్టేషన్​ ఎంపికైంది. దీంతో స్టేషన్​లో ఆధునీకరణ పనులు మొదలయ్యాయి. దాదాపు రూ.40 కోట్లతో కొత్త నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రయణికులకు అసౌకర్యం కలగకుండా తాత్కాలిక భవనాల్లో రైల్వే సేవలు కొనసాగిస్తున్నారు.

రైల్వే టెర్మినల్​ పనులు షురూ..​

మహబూబ్​నగర్​ రైల్వే స్టేషన్​కు రోజు రోజుకు ప్రయాణికుల తాకిడి పెరుగుతోంది. ఈ స్టేషన్​ నుంచి ప్రతి రోజూ 40 నుంచి 50 రైళ్లు వచ్చి పోతుంటాయి. అయితే స్టేషన్​కు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని డెవలప్​ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అమృత్​ భారత్​ రైల్వే స్టేషన్​ స్కీమ్​ కింద పలు అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లు పూర్తి చేశారు. ఇటీవల కొత్త భవనాల నిర్మాణాలను ప్రారంభించారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్న పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఎక్సవేటర్లు, లిఫ్ట్​లను అందుబాటులోకి తీసుకురానున్నారు. టాయిలెట్స్, రైల్వే శాఖకు సంబంధించిన అన్ని రకాల డిపార్ట్​మెంట్ల కోసం ప్రత్యేకంగా రూమ్స్​ నిర్మించనున్నారు. ఫుట్​ ఓవర్​ బ్రిడ్జిలను ఏర్పాటు చేయనున్నారు. 

ఎయిర్​ పోర్టులో ఉండే టర్మినల్  తరహాలో మహబూబ్​నగర్​లో రైల్వే టర్మినల్​ను నిర్మించనున్నారు. ఈ టర్మినల్​లో భాగంగా కాన్​ కోర్స్  మాదిరిగా పెద్ద హాల్​ నిర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాలకు జర్నీ చేసే ప్రయాణికులు వేచి ఉండేందుకు వెయిటింగ్​ హాళ్లు, ఆయా ప్లాట్ ​ఫామ్​ల వద్దకు వెళ్లేందుకు, స్టేషన్​ బయటకు వెళ్లేందుకు ఈ కాన్​ కోర్స్​ హాల్​ గుండా మార్గాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ హాలులోనే ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్​ కౌంటర్లు, రెస్టారెంట్లు, షాపులు ఏర్పాటు చేస్తారు.

తాత్కాలిక భవనాల్లో సేవలు..

కొత్త బిల్డింగుల నిర్మాణంలో భాగంగా పాత రైల్వే స్టేషన్​ భవనాన్ని కూల్చి వేయనున్నారు. ఈ బిల్డింగ్​లో ఉన్న టికెట్​ కౌంటర్​, ఎంక్వైరీ సెంటర్, రిజర్వేషన్​ కౌంటర్లను తాత్కాలిక భవనాల్లోకి మార్చారు. రిజర్వేషన్​ కౌంటర్​ను స్టేషన్​ ముందు భాగంలో ఎస్బీఐ ఏటీఎం పక్కన ఉన్న రైల్వే మెయిల్​ ఆఫీస్​లోకి, టికెట్​కౌంటర్, ఎంక్వైరీ సెంటర్లను రైల్వే పోలీస్​ స్టేషన్​ వెనుక భాగంలో ఉన్న బిల్డింగ్​లోకి షిఫ్ట్​ చేశారు. 8 నెలల పాటు ప్రయాణికులకు ఇక్కడి నుంచే సేవలు అందించనున్నారు. అలాగే మోతీనగర్​ ప్రాంత వాసులకు ఇబ్బంది కలగకుండా మొదటి ప్లాట్​ ఫామ్​ నుంచి చివరి ప్లాట్​ ఫామ్​ వరకు ఫుట్​ ఓవర్​ బ్రిడ్జిని నిర్మించనున్నారు.

పాలమూరు స్టేషన్​కు వందేళ్ల చరిత్ర..

పాలమూరు రైల్వే స్టేషన్​కు వందేళ్ల చరిత్ర ఉంది. 1870లో బ్రిటీష్​ వారు హైదరాబాద్​ నుంచి కర్నాటకలోని రాయచూర్, గుల్బర్గా ప్రాంతాలకు రైల్వే లైన్​ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో నిజాం నవాబులు భాగస్వాములై దీనికి నైజాం స్టేట్​ రైల్వేస్​గా పేరు పెట్టారు. ఇందులో భాగంగా మహబూబ్​నగర్​లో కూడా కొత్తగా రైల్వే స్టేషన్​ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 1888లో హైదరాబాద్​ నుంచి మీటర్​ గేజ్​ రైల్వే లైన్​ పనులు మొదలు పెట్టి, 1892లో పూర్తి చేశారు. 1922లో మహబూబ్​నగర్​ రైల్వే స్టేషన్​ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే మీటర్​ గేజ్​ నుంచి బ్రాడ్​ గేజ్​కు మారడంతో.. నిజాం పాలనలో కట్టిన పాత భవనాన్ని కూల్చివేశారు. 1993లో కొత్త భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దాదాపు 32 ఏండ్ల తర్వాత తాజాగా ఈ భవనాన్ని కూల్చనున్నారు. దీని స్థానంలో కొత్త భవనాన్ని అందుబాటులోకి రానుంది.