మహబూబ్‌నగర్ టూ విశాఖపట్నం ఎక్స్ ప్రెస్..

మహబూబ్‌నగర్ టూ విశాఖపట్నం ఎక్స్ ప్రెస్..

పాలమూరు-విశాఖపట్నం మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును  శనివారం ( మే20) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తో పాటు, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

పాలమూరు టూ విశాఖ

విశాఖ 12861, 12862 రైళ్ల రాకపోకల వల్ల ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రాంతాల ప్రజలు సులభంగా రాకపోకలు కొనసాగనున్నాయి.   మహబూబ్ నగర్,  మెదక్ జిల్లా ప్రజలు జడ్చర్ల, షాద్‌నగర్, కాచిగూడతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న  విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అన్నవరం, విశాఖపట్నం ప్రాంతాల మధ్య రాకపోకలు  కొనసాగుతాయి. ఈ అవకాశాలతో పాటు ఇరు ప్రాంతాల ప్రజలు విజ్ఞాన విహారయాత్రలు చేసుకోవడానికి అవకాశాలు మరింత మెరుగుపడనున్నాయి.

ట్రైన్ టైమింగ్స్..

ప్రతిరోజు సాయంత్రం మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి  నాలుగు గంటల పది నిమిషాలకు బయలుదేరుతుంది. స్టాప్ ఉన్న ప్రతి కేంద్రంలోనూ ఒక నిమిషం మాత్రమే నిలిచి ఆ తర్వాత బయలుదేరుతుంది. ముఖ్యమైన స్టేజీల వద్ద పది నిమిషాల వరకు ఆగుతుంది. మరుసటి రోజు ఉదయం 6.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. చార్జీలు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగానే నిర్ణయించారు.

చిరకాల కోరిక నెరవేరింది

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసుల చిరకాల కోరిక నెరవేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ అందాలు.. చూడాలంటే ఉమ్మడి పాలమూరు జనానికి వ్యయ ప్రయాసాలతో కూడిన వ్యవహారంగా ఉండేది. మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి రైలు లేదా బస్సుకు వెళ్లేవారు. దీంతో ప్రయాణం ఇబ్బందికరంగా ఉండేది. ఇక నుంచి ఈ పరిస్థితి ఉండదు. జిల్లా ప్రజల నుంచి విజ్ఙప్తులు విన్న ప్రభుత్వాలు స్పందించాయి. విశాఖపట్నం -కాచిగూడ మధ్య నడిచే విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇక నుంచి మహబూబ్ నగర్ వరకు నడిపించనున్నారు. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.