మా నాయకుడు తేజస్వీ యాదవ్.. మీ నాయకుడెవరు?.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు మహాగఠ్ బంధన్ సవాల్

మా నాయకుడు తేజస్వీ యాదవ్..  మీ నాయకుడెవరు?.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు మహాగఠ్ బంధన్ సవాల్
  • ఆర్జేడీ నేత తేజస్వీని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన కూటమి 
  •     డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ‘వీఐపీ’ లీడర్ ముకేశ్ సహానీ 
  •     ఏకాభిప్రాయంతో ఎన్నుకున్నట్టు అనౌన్స్ చేసిన కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ 
  •     మరికొందరిని డిప్యూటీ సీఎం అభ్యర్థులుగా ప్రకటిస్తామని వెల్లడి

పాట్నా: 
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ నాయకత్వంలోనే బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నామని మహాగఠ్ బంధన్ కూటమి ప్రకటించింది. ఈ ఎన్నికల్లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్‌ పేరును, డిప్యూటీ సీఎం అభ్యర్థిగా వికాస్‌శీల్​ఇన్సాన్‌ పార్టీ (వీఐపీ) ఫౌండర్ ముకేశ్​సహానీని అనౌన్స్ చేసింది. తేజస్వీ నాయకత్వంలోనే ముందుకెళ్లాలని భాగస్వామ్య పార్టీలు మొగ్గుచూపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గురువారం అధికారికంగా ప్రకటన వెలువడింది. 

బిహార్ రాజధాని పాట్నాలో జరిగిన మీడియా సమావేశంలో రాజస్థాన్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్‌ గెహ్లాట్ ఈ విషయాన్ని వెల్లడించారు. యువకుడు, అంకితభావంతో పనిచేసే లీడర్​ కనుకనే సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్‌ను ఎంపిక చేసినట్టు తెలిపారు. ‘‘నేను అమిత్​ షాను అడుగుతున్నా.. మా లీడర్​ తేజస్వీ యాదవ్‌.. మరి మీ ఎన్డీయే కూటమి చీఫ్​ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు?” అని సవాల్ చేశారు. 

డిప్యూటీ సీఎం క్యాండిడేట్‌​గా ముకేశ్ సహానీ

మహాగఠ్ బంధన్​ డిప్యూటీ సీఎం క్యాండిడేట్‌గా వికాస్‌శీల్​ఇన్సాన్‌ పార్టీ (వీఐపీ) ఫౌండర్ ముకేశ్​సహానిని ఎంపిక చేసినట్టు అశోక్‌ గెహ్లాట్​ వెల్లడించారు.  మరికొంతమంది డిప్యూటీ సీఎం క్యాండిడేట్లను త్వరలో ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. సీఎం క్యాండిడేట్‌గా తేజస్వీ యాదవ్‌ ఉండాలనేది కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్‌గాంధీ కోరిక అని తెలిపారు. 

కాంగ్రెస్ ​రెబల్స్‌ ధర్నా

రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి కృష్ణ అల్లవారు తీరు‌కు  నిరసనగా పలువురు కాంగ్రెస్​ అసంతృప్తులు నిరసన చేపట్టారు. బిహార్ ​ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ (బీపీసీసీ) ప్రధాన కార్యాలయం సదాకత్ ఆశ్రమం వద్ద ధర్నా నిర్వహించారు. చేతులకు నల్ల రిబ్బన్లు ధరించి..‘టికెట్ చోర్.. బిహార్ చోడ్’’ (టికెట్ దొంగ.. బిహార్ నుంచి వెళ్లిపో) అంటూ  నినాదాలు చేశారు.  కృష్ణ అల్లవారు ‘కార్పొరేట్ ఏజెంట్’, ‘ఆర్‌‌ఎస్‌ స్లీపర్ సెల్’ అని ఆరోపించారు. ఆయన తీరుతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతున్నదని, ఆయనను వెంటనే తొలగించాలని కాంగ్రెస్​ సీనియర్ నాయకుడు ఆనంద్ మాధవ్​ డిమాండ్​ చేశారు. తమ గొంతు రాహుల్ గాంధీకి చేరాలని  కోరుకుంటున్నామన్నారు.

బిహార్‌‌ పునర్నిర్మాణానికి కృషి చేస్తాం: తేజస్వీ యాదవ్   

తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించినందుకు కూటమి భాగస్వాములందరికీ తేజస్వీ యాదవ్‌ కృతజ్ఞతలు తెలిపారు. బిహార్​ పునర్నిర్మాణానికి మహాగఠ్ బంధన్ పని చేస్తుందని చెప్పారు. ‘‘నితీశ్‌ కుమార్​ కు అన్యాయం జరుగుతోంది. ఎన్డీయే సీఎం అభ్యర్థిగా ఇంకా ఆయన పేరు  ప్రకటించలేదు. నేను అమిత్​షాను అడుగుతున్నా.. ప్రతి ఎన్నికలకు ముందు నితీశ్​ పేరునే ప్రకటించి..  ఈసారి ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు. ఇదే నితీశ్​ కుమార్​ చివరి ఎన్నిక” అని అన్నారు.