ఫ్రీ బస్ జర్నీలో కండక్టర్ల అత్యుత్సాహం .. ఎక్కడ దిగినా లాస్ట్‌‌‌‌ స్టాప్‌‌ దాకా టికెట్

ఫ్రీ బస్ జర్నీలో కండక్టర్ల అత్యుత్సాహం .. ఎక్కడ దిగినా  లాస్ట్‌‌‌‌ స్టాప్‌‌ దాకా టికెట్
  • ‘మహాలక్ష్మి’ ఫ్రీ జర్నీ విషయంలో కొందరు కండక్టర్ల అత్యుత్సాహం
  • అడ్డగోలుగా టికెట్ల జారీ.. ఒక్కరికే మూడు ఇస్తున్నరు
  • కొన్నిచోట్ల ప్యాసింజర్లు లేకున్నా టికెట్లు కొడుతున్నరు
  • ప్రయాణించని దూరానికి ప్రభుత్వం ఎందుకు డబ్బులు చెల్లించాలంటున్న జనం
  • సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి ఫ్రీ బస్ జర్నీ స్కీమ్‌‌లో కొందరు కండక్టర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మధ్యలోనే దిగుతున్నా సరే.. ప్రయాణికులకు లాస్ట్ స్టాప్ వరకు టికెట్ ఇస్తున్నారని ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఒక్కరికే మూడు టికెట్లు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల ప్యాసింజర్లు లేకున్నా టికెట్లు కొడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాము ప్రయాణించని దూరానికి ప్రభుత్వం ఎందుకు డబ్బులు చెల్లించాలని మహిళలు ప్రశ్నిస్తున్నారు. అనవసరంగా ప్రభుత్వంపై భారం మోపుతున్నారని మండిపడుతున్నారు. మహాలక్ష్మి స్కీమ్‌‌కు సంబంధించి సరైన గైడ్​లైన్స్ లేకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళలతో కండక్టర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, మహిళా కండక్టర్లు కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారని కొందరు ప్రయాణికులు చెబుతున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయాలేవీ తమ దృష్టికి రాలేదని, ఒకవేళ జరిగినట్లు తెలిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

దమ్మాయిగూడ టు బాలాజీ నగర్.. 
టికెట్ మాత్రం సికింద్రాబాద్‌‌కు

ఓ ప్రయాణికురాలు హైదరాబాద్‌‌లోని దమ్మాయిగూడ నుంచి బాలాజీ నగర్ వెళ్లారు. కానీ తనకు కంటోన్మెంట్ డిపో బస్ కండక్టర్ లాస్ట్ స్టాప్ సికింద్రాబాద్ వరకు టికెట్ ఇచ్చారని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్‌‌ (ఎక్స్‌‌)‌‌లో టికెట్ల ఫొటోలను షేర్ చేశారు. మళ్లీ బాలాజీ నగర్ నుంచి దమ్మాయిగూడకు వెళ్తే ఘట్​కేసర్ వరకు టికెట్ ఇచ్చారని తెలిపారు. ఏదో తప్పు జరుగుతున్నదని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ప్రయాణించని దూరానికి ప్రభుత్వం ఎందుకు డబ్బులు చెల్లించాలని ప్రశ్నించారు.

ఒక్కరికే మూడు టికెట్లు

ఓ యువతికి మూడు టికెట్లు ఇచ్చినట్లు ట్విట్టర్‌‌‌‌లో ఓ వ్యక్తి ఫొటోలను షేర్ చేశారు. కిషన్ గూడ నుంచి అఫ్జల్ గంజ్​కు ఒక్కరు వెళ్తే.. మూడు టికెట్లు ఇచ్చారని తెలిపారు. ఒకరికి చార్జ్ రూ.30 అని, టికెట్‌‌లో ‘3X30=90’ రూపాయలు అని చూపిస్తున్నదని పేర్కొన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్, సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేశారు. 

మా దృష్టికి రాలేదు

లాస్ట్ స్టాప్ వరకు టికెట్లు ఇస్తున్నట్లు ఇంత వరకు మా దృష్టికి రాలేదు. ఒక వేళ వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ప్రయాణికులతో ఎలా ప్రవర్తించాలనే విషయం మీద కండక్టర్లకు గేట్ మీటింగ్​లు నిర్వహిస్తున్నాం.
‑ఎల్.రామ్మోహన్, కంటోన్మెంట్ డిపో మేనేజర్

కొన్ని రోజుల్లో అన్నీ సెట్ అయితయి

లాస్ట్ స్టాప్‌‌నకు టికెట్లు ఇవ్వడం, ఒక్కరికి మూడు టికెట్లు ఇవ్వడం, దురుసుగా ప్రవర్తించడం వంటి అంశాలు మా దృష్టికి రాలేదు. ఏయే డిపో బస్సుల్లో జరిగిందో తెలిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇది వరకు సిటీలో 70 శాతం ఆక్యుపెన్సీతో బస్సులు నడిచేవి. మహాలక్ష్మి స్కీమ్ అమల్లోకి వచ్చాక ఆక్యుపెన్సీ 100 శాతానికి పెరిగింది. కండక్టర్లకు వర్క్ ప్రెజర్ పెరిగింది. కొన్ని రోజుల్లో అన్ని సర్దుకుంటాయి.
‑ టీ.శ్రీనివాస రావు, డిప్యూటీ ఆర్ఎం,
గ్రేటర్ హైదరాబాద్ జోన్

సిటీ వరకైనా స్పెషల్ పాస్​లు ఇవ్వాలి

మహాలక్ష్మి స్కీమ్ కోసం ప్రత్యేకంగా కార్డులు, పాసులు ఇస్తే బాగుంటుంది. కొంత మంది ప్రయాణికులు ఆధార్ చూపించి.. ఫోన్​ నొక్కతూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు. ఎక్కడికి వెళ్లాలో చెప్పరు. ఎక్కడికి వెళ్లాలని అడిగినా పలకరు. అలా కొన్ని సార్లు టికెట్ స్టాప్​ విషయంలో పొరపాటు జరిగే అవకాశం ఉండొచ్చు. కానీ కావాలని ఎవరూ చేయరు.
‑ ఓ కండక్టర్, హైదరాబాద్