
- విప్రో లాభం రూ. 3,330 కోట్లు
- ఏడాది లెక్కన11శాతం పెరుగుదల
- మొత్తం ఆదాయం రూ. 22,134 కోట్లు
- రూ.ఐదు చొప్పున డివిడెండ్
న్యూఢిల్లీ: టెక్నాలజీ కంపెనీ విప్రో ఈ ఏడాది జూన్ క్వార్టర్ ఫైనాన్షియల్ రిజల్ట్స్‌ను ప్రకటించింది. ఈసారి కన్సాలిడేటెడ్ పద్ధతిలో నికర లాభం 11శాతం పెరిగి రూ. 3,330 కోట్లుగా నమోదయింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 3,003 కోట్లుగా ఉంది. విప్రో 2025–-26 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.ఐదు చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కూడా ప్రకటించింది.
జులై 28 తేదీని రికార్డు తేదీగా నిర్ణయించారు. వచ్చే నెల 15లోపు చెల్లిస్తారు. ఈ ఐటీ సేవల సంస్థ కార్యకలాపాల ద్వారా ఆదాయం స్వల్పంగా 0.7శాతం పెరిగి రూ. 22,134 కోట్లుగా నమోదయింది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 21,963 కోట్లు వచ్చాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే నికరలాభం ఏడుశాతం తగ్గింది. గత క్వార్టర్లో రూ. 3,570 కోట్ల లాభం వచ్చింది.
రాబోయే క్వార్టర్లో ఐటీ సేవల వ్యాపార విభాగం ఆదాయం 2,560 మిలియన్ డాలర్ల నుంచి 2,612 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని విప్రో అంచనా వేసింది. నిలకడైన కరెన్సీ పరంగా ఇది –-1.0శాతం నుంచి 1.0శాతం మధ్య ఉండొచ్చు.
ఇతర ముఖ్యాంశాలు:
- జూన్ క్వార్టర్లో స్థూల ఆదాయం రూ. 22,130 కోట్లు ఉంది. ఇది సీక్వెన్షియల్‌గా 1.6శాతం తగ్గింది. ఏడాది లెక్కన 0.8శాతం పెరిగింది.
- ఐటీ సేవల విభాగం ఆదాయం 2,587.4 మిలియన్డాలర్లు ఉంది. ఇది సీక్వెన్షియల్‌గా 0.3శాతం, ఏడాది లెక్కన 1.5శాతం తగ్గింది.
- నాన్–జీఏఏపీ2 కన్స్టంట్ కరెన్సీ ఐటీ సేవల విభాగం ఆదాయం సీక్వెన్షియల్‌గా 2.0శాతం, ఏడాది లెక్కన 2.3శాతం తగ్గింది.
- మొత్తం బుకింగ్‌ల విలువ కన్స్టంట్ కరెన్సీ పరంగా 4,971 మిలియన్ డాలర్లు ఉంది. ఇది సీక్వెన్షియల్‌గా 24.1శాతం, ఏడాది లెక్కన 50.7శాతం పెరిగింది. భారీ డీల్ బుకింగ్స్ విలువ 2,666 మిలియన్ డాలర్లు ఉంది. ఇది సీక్వెన్షియల్‌గా 49.7శాతం, ఏడాది లెక్కన 130.8శాతం పెరింది.
- ఐటీ సేవల ఆపరేటింగ్ మార్జిన్ 17.3శాతంగా ఉంది. ఇది సీక్వెన్షియల్‌గా 0.2శాతం తగ్గి, ఏడాది లెక్కన 0.8శాతం పెరిగింది.
- నికర ఆదాయం సీక్వెన్షియల్‌గా 6.7శాతం తగ్గింది. కార్యకలాపాల క్యాష్‌ఫ్లో రూ. 4,110 కోట్లు (479.6 మిలియన్ డాలర్లు)గా ఉంది. ఇది సీక్వెన్షియల్‌గా 9.8శాతం, ఏడాది లెక్కన 2.9శాతం పెరిగింది. క్వార్టర్లీ నికర ఆదాయంలో 123.2శాతంగా ఉంది.
- వాలంటరీ అట్రిషన్ రేటు (స్వచ్ఛందంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టిన వారి శాతం) గత 12 నెలల కాలానికి 15.1శాతంగా ఉంది.
మేనేజ్‌మెంట్ కామెంటరీ
ఈ ఫలితాలపై సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీని పల్లియా మాట్లాడుతూ, ఈ క్వార్టర్లో స్థూల ఆర్థిక ఇబ్బందుల వల్ల క్లయింట్లు సామర్థ్యం, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉన్నారని తెలిపారు.
“ఈ అవసరాలను తీర్చడానికి మేం వారితో సన్నిహితంగా పని చేశాం. ఫలితంగా రెండు మెగా డీల్‌లతో సహా మొత్తం 16 పెద్ద డీల్స్ కుదుర్చుకున్నాం. గత క్వార్టర్ నుంచి వచ్చిన ఊపు, బలమైన ఆర్డర్లతో మంచి స్థితిలో ఉన్నాం. ఏఐ ఇకపై ప్రయోగాత్మకం కాదు. ఇది మా క్లయింట్లకు కీలకం అవుతుంది” అని ఆయన అన్నారు.