తండాల్లోమౌలిక సదుపాయాలు కల్పిస్తాం ...జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్

తండాల్లోమౌలిక సదుపాయాలు కల్పిస్తాం ...జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్

నారాయణ్ ఖేడ్, వెలుగు: తండాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సెగ్మెంట్ లోని సిర్గాపూర్ వంగ్ధాల్ గైరాన్ తండాలో పర్యటించారు. గోర్ బంజారా  సంప్రదాయం ప్రకారం  ఎస్టీ కమిషన్ మెంబర్ ను ఘనంగా స్వాగతించారు. తండావాసులతో సమావేశమై మాట్లాడారు. 

రోడ్డు, వాగుపై వంతెన, కరెంటు, విద్య, వైద్యం తదితర సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. గిరిజనులకు అండగా కమిషన్ ఉంటుందని హామీ ఇచ్చారు. గైరాన్ తండా రోడ్డు, వాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతుందని జిల్లా అడిషనల్  కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. 

 పైలెట్ తండాను ఎంపిక చేశామని ఇటీవల 21 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్టు, ఇంకా అర్హులు ఉంటే ఇస్తామని  చెప్పారు. గైరాన్ తండాకు చెందిన పీహెచ్ డీ స్కాలర్ రాహుల్ వడిత్యా సమస్యలపై నేషనల్ ఎస్టీ కమిషన్ కు  ఫిర్యాదు చేయడంతో సందర్శించినట్లు చెప్పారు. అనంతరం గిరిజన సంఘాల నేతలు తండాల పరిస్థితులు, సమస్యలపై కమిషన్ మెంబర్ కు వినతి పత్రం ఇచ్చారు.  ఆయన వెంట అడిషనల్ ఎస్పీ సంజీవరావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.