
'మహానటి'గా తెలుగు ప్రేక్షకులను మెప్పించి సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్. డిసెంబర్ 2024లో ఆమె తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన ఆంటోనీ తట్టిల్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న బ్యూటీ.. ఇటీవల తన వ్యక్తగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. అయితే, తమ పెళ్లికి ముందు మతపరమైన తేడాల కారణంగా కుటుంబం అంగీకరించదేమోనని తాను భయపడినట్లు వెల్లడించింది.
మతపరమైన తేడాల కారణంగా ఇంట్లో...
లేటెస్ట్ గా జగపతి బాబు టాక్ షో 'జయంము నిశ్చయమ్ము రా'లో ఈ కేరళ కుట్టి కీర్తి సురేష్ పాల్గొంది. ఈ సందర్భంగా తన ప్రేమకథను, వివాహానికి ముందు ఎదురైన మానసిక సంఘర్షణను సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. కీర్తి సురేష్ హిందూ కుటుంబానికి చెందినవారు కాగా, ఆంటోనీ క్రైస్తవ మతానికి చెందినవారు. అందుకే మతపరమైన తేడాల కారణంగా ఇంట్లో సమస్యలు వస్తాయేమోనని మేము భావించాము. నాలుగేళ్ల క్రితం ఒక రోజు నేను నాన్నతో మాట్లాడాను. కానీ, నాన్న దాన్ని చాలా సులభంగా ఆంగీకరించారు. నేను ఊహించినంత కష్టంగా ఏమీ జరగలేదు అని కీర్తి తన మనసులోని మాటను బయటపెట్టారు. ఆమె తండ్రి సురేష్ కుమార్ , తల్లి మేనక ఇద్దరూ సినీ పరిశ్రమకు చెందినవారే కావడంతో, వారు కూతురి నిర్ణయాన్ని గౌరవించి, ఆమె ప్రేమకు అండగా నిలిచారు.
ఆంటోనీతో 15 ఏళ్లుగా ప్రేమ ప్రయాణం..
ఆంటోనీతో తన ప్రేమ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. పెళ్లి పీటలెక్కడానికి 15 ఏళ్లు పట్టిందని కీర్తి తెలిపారు. మాకు సమయం కావాలి. మేము కాలేజీ రోజుల్లోనే 2010లో డేటింగ్ మొదలుపెట్టాం. నేను అప్పుడు కాలేజీ పూర్తి చేయాలి, కెరీర్‌లో స్థిరపడాలి. ఈ 15 ఏళ్లలో, ఆంటోనీ ఖతార్‌లో ఉండటం, నేను చెన్నైలో ఉండటం వల్ల సుమారు ఐదారేళ్లు లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లోనే ఉన్నాం. ఆ తర్వాత ఆయన భారతదేశానికి వచ్చాక, మా ఇద్దరికీ కొంత సమయం అవసరమైంది అని వివరించారు. స్కూల్ రోజుల నుంచే తాము స్నేహితులని, ఈ స్నేహమే ప్రేమగా మారిందని కీర్తి పంచుకున్నారు.
ప్రేమ గుర్తుగా 'నైక్'
'మహానటి' సినిమా విజయానంతరం ఆంటోనీ ఆమెకు ఓ కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చారని కీర్తి గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తాము తమ బంధం గురించి బహిరంగంగా మాట్లాడలేకపోయినప్పటికీ, ఆ ప్రేమను గౌరవించుకుంటూ ఆ శునకానికి తమ పేర్ల కలయికగా 'నైక్' (Nyke) అని పేరు పెట్టానని కీర్తి చెప్పారు. ఆంటోనీ (Antony)లోని 'Ny' , కీర్తి (Keerthy)లోని 'Ke' అక్షరాలను కలిపి ఈ పేరు పెట్టామని చెప్పుకొచ్చింది. కీర్తి సురేష్, ఆంటోనీ తట్టిల్ వివాహం 2024 డిసెంబర్ 12న గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. వీరిద్దరూ తమ సంప్రదాయాలను గౌరవిస్తూ హిందూ, క్రైస్తవ పద్ధతుల్లో రెండుసార్లు పెళ్లి వేడుకను నిర్వహించుకున్నారు.
ఇక వృత్తిపరంగా చూస్తే.. కీర్తి సురేష్ తన పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటిస్తున్నారు. ఆమె తదుపరి విజయ్ దేవరకొండ సరసన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రౌడీ జనార్ధ' లో నటిస్తున్నారు. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం ఇటీవల జరిగింది. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ చేతిలో హిందీ చిత్రం 'బేబీ జాన్' , తమిళ చిత్రాలు 'రివాల్వర్ రీటా', 'కన్నెవీడి' వంటి మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక వైపు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు తన కెరీర్‌లోనూ దూసుకుపోతుంది కీర్తి సురేష్.