
హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ దుకాణం బంద్ అయ్యేటట్లు కనిపిస్తున్నది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి.. బీఆర్‌ఎస్ మహారాష్ట్ర శాఖను అధిష్టానం పట్టించుకోవడం లేదు. కనీసం అక్కడ ఉన్న పార్టీ ఆఫీసులకు ఆరు నెలలుగా అద్దె కూడా చెల్లించడం లేదని ఆ రాష్ట్ర బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఆఫీసులకు ఆరు నెలలుగా అద్దె కూడా చెల్లించడం లేదని మహారాష్ట్ర నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై చెబుదామంటే పార్టీ నాయకులు అందుబాటులోకి రావడం లేదని పేర్కొంటున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర బీఆర్‌ఎస్ నాయకులు రాసిన లేఖలు, వారి ఆడియోలు, వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తెలంగాణ మోడల్ అంటే ఇదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. తమ పరిస్థితి ఎటుగాకుండా పోయిందని, బీఆర్‌ఎస్‌లో చేరి మహారాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ మహారాష్ట్ర శాఖ ఉంటదో లేదో కూడా క్లారిటీ ఇస్తే తమ దారి తాము చూసుకుంటామని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్‌ను తీసుకొస్తామని ప్రకటించిన కేసీఆర్.. అక్కడ వివిధ పార్టీల నుంచి నాయకులను, కార్యకర్తలను పార్టీలో చేర్చుకున్నారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ ఆఫీసు కూడా ఓపెన్ చేశారు.