పీఎం, సీఎంల ఎంపికకు కూడా టెండర్లు పిలుస్తారు

పీఎం, సీఎంల ఎంపికకు కూడా టెండర్లు పిలుస్తారు

‘అగ్నిపథ్’ పథకం విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కేంద్రంపై మండిపడ్డారు. ఒప్పంద పద్ధతిలో సైనిక నియామకాలు ప్రమాదకరమని, యువత ఆశయాలు, జీవితాలతో ఆటలాడుకోవద్దని చెప్పారు. శివసేన 56వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం (జూన్ 19న) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘రేపు అద్దెకు ప్రభుత్వం కావాలంటారు. ప్రధాని, ముఖ్యమంత్రుల ఎంపిక కోసం టెండర్లు పిలుస్తారు. ఒకవేళ ఇలాగే కొనసాగించాలనుకుంటే ప్రతిదానికీ అద్దెకు తీసుకుని తొలగించే(Hire And Fire), వాడి పడేసే (Use And Throw) నియామక విధానాలను అవలంబించాలి’ అని కేంద్రంపై నిప్పులు చెరిగారు. 

‘ మీరు నిలబెట్టుకోగలిగే వాగ్దానాలు మాత్రమే చేయాలి. ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని పెద్ద ఎత్తున హామీలు ఇస్తున్నారు. ఏం చేస్తారు..? ఏమీ లేదు. అగ్నిపథ్, అగ్నివీరుల వంటి పెద్ద పెద్ద పేర్లతో పథకాలు తెస్తారు. శివసేన మహారాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఎన్నడూ విస్మరించలేదు. అందుకే బలంగా కొనసాగుతోంది’ అని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో హింసాత్మక నిరసనలు జరిగినప్పటికీ.. తమ రాష్ర్టం (మహారాష్ట్ర) ప్రశాంతంగా ఉందని అన్నారు.

పెద్దనోట్ల రద్దు సమయంలోనూ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడ్డారని, ఆ తర్వాత నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినప్పుడు కూడా కేంద్రం తీరుపై పెద్ద ఎత్తున రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయన్నారు. ఇవాళ కేంద్రం అగ్నిపథ్ పేరుతో కొత్త సమస్యను సృష్టించిందని అన్నారు. అగ్నిపథం విషయంలో నాలుగేళ్ల తర్వాత అగ్నివీరులకు ఉద్యోగాలు ఉండవన్నారు. ఈ పరిస్థితుల్లో యువత రోడ్డున పడితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.