మంత్రులొచ్చిన్రు కానీ థాక్రేకు తలనొప్పే

మంత్రులొచ్చిన్రు కానీ థాక్రేకు తలనొప్పే

మంది ఎక్కువ. మజ్జిగ తక్కువ. ఇదీ… కేబినెట్ విస్తరణలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే పరిస్థితి. మూడు పార్టీల మహారాష్ట్ర వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం కావటం వల్ల కేబినెట్లో చోటుకి పోటీ ఎక్కువైంది. దీంతో పదవుల పంపకానికి నెల రోజుల టైమ్ తీసుకున్నారు. మినిస్ట్రీల కేటాయింపుకు మరో వారం పట్టింది. ఇంత చేసినా సొంత పార్టీలోనూ సంతృప్తి లేకుండా పోయింది. ఇక, మిత్ర పక్షాల సంగతి సరే సరి. ఈ ఎఫెక్ట్ ప్రభుత్వం భవిష్యత్పై పడుతుందని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు.

ఆలస్యం అమృతం విషం అంటారు. అమృతమైనా, విషమైనా ఆలస్యం మహారాష్ట్ర రాజకీయాల్లో తప్పట్లేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల రోజులకు గానీ ప్రభుత్వం ఏర్పడలేదు. ఎట్టకేలకు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల సర్కారు కొలువు దీరింది. మరో నెల తర్వాత గానీ ఫుల్ టైమ్ కేబినెట్ ఏర్పడలేదు. ఒకటీ, రెండు రోజుల్లో శాఖలు కేటాయిస్తామని సీఎం థాక్రే చెప్పారుగానీ.. అనుకున్నంత ఈజీగా జరగలేదు.

సీఎం సొంత గూటిలోనే..
డిప్యూటీ సీఎం పోస్టు ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్కి దక్కటంపై ఎవరికీ పేచీ లేదు. హోం శాఖ పైనే అసలు ఇబ్బంది ఎదురైంది. ఆ పోర్ట్ఫోలియోని ఎన్సీపీ నాయకుడు అనిల్ దేశ్ముఖ్కి ఇవ్వాలని శరద్ పవార్ సూచించడంపై శివసేన అబ్జెక్షన్ చెప్పింది. దీనికితోడు తనను మినిస్టర్ని చేయకపోవటంపై వెటరన్ శివసైనికుడు భాస్కర్ జాదవ్ తీవ్రంగా మండిపడుతున్నారు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాకపోవటంతో ఎన్సీపీలోకి వెళ్లి, మొన్నటి ఎలక్షన్కి ముందు మళ్లీ శివసేన గూటికి చేరారు జాదవ్. ఈసారి తనకు కేబినెట్ బెర్త్ ఖాయమనుకున్నా సీఎం పట్టించుకోలేదు.

మరో ఇద్దరు శివసేన సీనియర్ లీడర్లు రామ్దాస్ కదమ్, తానాజీ సావంత్లను కూడా కేబినెట్లోకి తీసుకోకపోవటం చర్చనీయాంశంగా మారింది. దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నమెంట్లో రామ్దాస్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా పనిచేశారు. తానాజీ ఎన్సీపీ నుంచి శివసేనలోకి దిగుమతయిన లీడర్. మహారాష్ట్రలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లు చాలావరకు తానాజీ కంట్రోల్లోనే ఉంటాయి. బీజేపీ–శివసేన సర్కారులో తానాజీ కేబినెట్ మంత్రి. ఈ ఇద్దరికీ ఉద్ధవ్ థాక్రే కేబినెట్లో ప్రయారిటీ లేకుండా పోయింది.

ఇండిపెండెంట్లకు ఇవ్వటంపై మరింత కోపం
వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదనే సామెత తెలిసిందే కదా. కానీ… శివసేన లీడర్లకు వర్తించలేదు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మరెవరో కాదు. స్వయంగా ఆ పార్టీ ప్రెసిడెంట్. అయినా శివసేన నాయకులను కాదని ఏకంగా ముగ్గురు ఇండిపెండెంట్లను పార్టీ కోటాలో మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇది శివసేన నేతలకు మింగుడు పడట్లేదు. మంత్రి పదవులు వరించిన ఆ ముగ్గురి పేర్లు.. బచ్చు(ఓం ప్రకాశ్) కడు, శంకర్ రావ్ గడఖ్, రాజేంద్ పాటిల్ యాద్రావ్కర్.

ఈ ముగ్గురితోపాటు రీసెంట్గా పార్టీలోకి వచ్చిన అబ్దుల్ సత్తార్కికూడా శివసేన కోటాలోనే మినిస్టర్గా ప్రమోషన్ వచ్చింది. పార్టీ లాయలిస్టుల వాదనలను పక్కనపెట్టి ఉద్ధవ్ థాక్రే ఈ నలుగురికీ పెద్ద పీట వేయటం గమనించాల్సిన విషయం. శివసేన లెజిస్లేచర్లు అనిల్ బాబర్, సత్తర్లిద్దరూ సాంగ్లీ, ఔరంగాబాద్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో రెబెల్స్ని నిలబెట్టి పార్టీని దెబ్బకొట్టారన్న విమర్శలున్నాయి. వాటిని సీఎం లైట్ తీసుకోవటాన్ని శివసేన లీడర్లు, కేడర్ జీర్ణించుకోలేకపోతున్నారు.

మహారాష్ట్ర వికాస్ అఘాడి (ఎంవీఏ) సర్కారు ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది. కేబినెట్ పూర్తి స్థాయిలో కొలువు దీరింది. ఇక, పాలనే పుంజుకోవాల్సి ఉంది. మూడు పార్టీలు కలిసి గవర్నమెంట్ను ఏర్పాటుచేశాయి కాబట్టి, ఈ మాత్రం అంతర్గత గొడవలు, అలకలు సహజమేనంటున్నారు ఎనలిస్టులు. అవి ముదరకుండా చూసుకుంటే చాలు, ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వానికి ఢోకా లేదని భావిస్తున్నారు. ఐదారు నెలలైనా గడవకముందే సర్కారు పనితీరుపై అంచనాకు రాలేమని, దేనికైనా కాలమే సమాధానం చెబుతుందని అంటున్నారు.

ఎన్సీపీ, కాంగ్రెస్లలో…
మినిస్టర్ పోస్టును ఆశించి భంగపడ్డ ఎన్సీపీ నేత, మాజీ మంత్రి ప్రకాశ్ సోలంకీ పార్టీ వీడటానికి సిద్ధపడ్డారు. దీంతో హైకమాండ్ రంగంలోకి దిగి బుజ్జగించింది. భోర్ సెగ్మెంట్ నుంచి గెలిచిన కాంగ్రెస్ లెజిస్లేచర్ సంగ్రామ్ థప్తేకీ కేబినెట్లో చోటు దక్కకపోవటంతో ఆయన అనుచరుల్లో కోపం కట్టలు తెగింది. పార్టీ ఆఫీసుపై దాడికి దారి తీసింది. స్వాతంత్ర్య పోరాట సమయంలో పార్టీ కార్యక్రమాలకు ఈ ‘కాంగ్రెస్ భవన్’ కీలక కేంద్రంగా ఉండేది. అలాంటి కార్యాలయంపై ఎటాక్ జరగటం కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహానికి అద్దం పడుతోందంటున్నారు.
పి.ఎన్.పాటిల్ అనే మరో కాంగ్రెస్ ఎమ్మెల్యేదీ ఇదే పరిస్థితి. ఆయన కూడా హస్తం పార్టీకి గుడ్బై చెబుతానని హెచ్చరిస్తున్నారు. ఇదే పార్టీలోని ముస్లిం నాయకులూ నిరాశకు గురయ్యారు. కాంగ్రెస్కి తమ కమ్యూనిటీ ఇచ్చిన సపోర్ట్ దృష్ట్యా మరో లీడర్కి మినిస్టర్ పోస్టు రావలసిందని అంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే అస్లాం షేక్కి టెక్స్టైల్ మినిస్ట్రీ లభించింది. మరో వైపు.. ఈ మూడు పార్టీల్లో నెలకొనే అసంతృప్తి కోసమే తాము ఎదురుచూస్తున్నామని బీజేపీ చెబుతోంది.

వాళ్లిద్దరు సమర్థులు కారా?
హోం మంత్రిగా ఎన్సీపీ సీనియర్ లీడర్ అనిల్ దేశ్ముఖ్ని ఎంపిక చేసే విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై శివసేన ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రిస్క్తో కూడిన ఆ పదవిని తీసుకోవటానికి ఎన్సీపీలో ఎవరూ ముందుకు రాకపోవటం వల్లే ఆయనకి పగ్గాలు అప్పగించామని పవార్ చెప్పటం సరికాదని పార్టీ పత్రిక సామ్నా తప్పు పట్టింది. అజిత్ పవార్కి గానీ దిలీప్ వాల్సే పాటిల్కి గానీ ఛాన్స్ ఇవ్వాల్సిందని ఎడిటోరియల్లో అభిప్రాయపడింది. మహారాష్ట్రలో హోం శాఖను డీల్ చేయటం కత్తి మీద సాము లాంటిదని అంటుంటారు.
గతంలో ఆర్ఆర్ పాటిల్, జయంత్ పాటిల్, ఛగన్ భుజ్బల్ వంటి వారు ఈ పోర్ట్ఫోలియోని చక్కగా నిర్వహించారు. గత ప్రభుత్వంలో సీఎం ఫడ్నవీసే ఈ శాఖను చూశారు. అయినా పలుమార్లు నిరసనలు, ఆందోళనలు చోటుచేసుకున్నాయి.

సంజయ్ రౌత్ తమ్ముడికి కేబినెట్ కుర్చీ దక్కలే
శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సంజయ్ రౌత్ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత పార్టీలో చాలా యాక్టివ్గా వ్యవహరించారు. బీజేపీతో శివసేన పొత్తు చెడటంలో, ఆ తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీలతో కూటమి కట్టడంలో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో రాజ్యసభ ఎంపీ అయిన సంజయ్దే కీలక పాత్ర. అందుకే ఆయన్ని ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా శివసైనికులు పిలుస్తున్నారు. అయితే… ఆయన తమ్ముడు, ఎమ్మెల్యే సునీల్ రౌత్ని సైతం కేబినెట్ విస్తరణలో లెక్కలోకి తీసుకోకపోవటం చెప్పుకోదగ్గ విషయం.