దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి : అజిత్​ పవార్​

దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి : అజిత్​ పవార్​

పుణె: లోక్​సభ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్​పవార్​అన్నారు. ఈ ఎన్నికలు ఒక గ్రామం లేదా ఒక కుటుంబం గురించి జరుగుతున్న ఎన్నికలు కావని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలోని బారామతిలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ లోక్​సభ స్థానం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై అజిత్​పవార్​భార్య సునేత్రా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాగా, సునేత్రా పవార్​కు మద్దతుగా శనివారం అంబేగావ్‌‌‌‌లో ఏర్పాటు చేసిన సభలో అజిత్ పవార్​పాల్గొని మాట్లాడారు. 

గతంలో ఇక్కడ గడియారం గుర్తుపై గెలిచిన వారు ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించేవారని, ఈసారి గెలిచే వారు ప్రధానికి మద్దతు ఇస్తారని పవార్ పేర్కొన్నారు. 2009 నుంచి బారామతి నుంచి ఎంపీగా ఉన్న సూలే.. గత 15 ఏండ్లలో ఏం అభివృద్ధి చేసిందో ఆలోచించి ఓటు వేయాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తాను మరాఠా సమాజం కోసం చాలా కష్టపడ్డానని ఆయన పేర్కొన్నారు. అజిత్ పవార్ ఎన్సీపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. దీంతో గతేడాది జులైలో ఎన్సీపీ చీలిపోయింది. ఎన్నికల సంఘం పవార్ వర్గానికే ఆ పార్టీ సింబల్​ గడియారం గుర్తును కేటాయించింది.