- మహారాష్ట్రలో దారుణం.. డాక్టర్లు, మహిళా, విద్యార్థి సంఘాల ఆగ్రహం
- ఐదు నెలల్లో 4 సార్లు అఘాయిత్యం
- మరో పోలీసు అధికారి వేధింపులు
- ఎస్పీ, డీఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో సూసైడ్
ముంబై: పోలీసుల లైంగిక వేధింపులు తట్టుకోలేక ఒక యువ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడడం మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది. తను పడుతున్న మానసిక వేదనపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా వారు పట్టించుకోకపోవడంతో చేతిపైనే సూసైడ్నోట్రాసుకొని ఆమె బలవన్మరణం చెందారు. సతారా జిల్లాలోని ఫల్తాన్ సబ్ డిస్ట్రిక్ట్ ఆసుపత్రిలో బాధితురాలు (29) మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
ఈ నెల 23న ఫల్తాన్‌లోని ఓ హోటల్ గదిలో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సబ్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ భద్నే గత ఐదు నెలలుగా తనపై నాలుగు సార్లు అత్యాచారం చేశాడని, మరో పోలీసు అధికారి ప్రశాంత్ బంకర్ తనను మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నాడని తన అరచేతిపై రాసుకున్న సూసైడ్ నోట్‌లో ఆమె పేర్కొంది. ఇదే విషయమై జూన్ 19న ఫల్తాన్ డీఎస్పీకి, తర్వాత జిల్లా ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.
పోలీసు ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో ఆమె తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లి బలవన్మరణానికి పాల్పడినట్టు అధికారులు చెప్తున్నారు. బాధితురాలు 4 పేజీల సూసైడ్ నోట్ కూడా రాయగా, దానినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలు పోలీసు కేసుల్లో ఇరుక్కున్న నిందితులకు ఫేక్ ఫిట్ నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఓ ఎంపీ కూడా తనను ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించారు. సూసైడ్ నోట్లోని వివరాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనపై డాక్టర్ల, మెడికల్ సంఘాలు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
