మహారాష్ట్ర వరదల్లో చిక్కుకుని 129 మంది బలి

మహారాష్ట్ర వరదల్లో చిక్కుకుని 129 మంది బలి
  • కుంభవృష్టి వానలతో మహారాష్ట్ర అల్లకల్లోలం
  • ఒక్క రాయిగఢ్‌‌‌‌ జిల్లాలోనే 49 మంది మృతి

ముంబై/పుణె: మహారాష్ట్రలో కుంభవృష్టి వానలు కల్లోలం సృష్టిస్తున్నాయి. గత 40 ఏళ్లలో ఎన్నడూ ఎరుగని రీతిలో ఊళ్లకు ఊళ్లను ముంచెత్తుతున్నాయి. మహారాష్ట్రలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి, వరదల్లో చిక్కుకుని 48 గంటల్లో 129 మంది చనిపోయారు. ఒక్క రాయిగఢ్‌‌‌‌ జిల్లాలోనే కొండచరియలు విరిగిపడి 38 మంది చనిపోయారు. చాలా మంది వరద నీటిలో కొట్టుకుపోయారు. ఇదే జిల్లాలోని పొలాడ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో 11 మంది, రత్నగిరి జిల్లాలోని చిప్లన్‌‌‌‌లో 8 మంది, సతారా జిల్లాలో 14 మంది గత రెండు రోజుల్లో చనిపోయారు. రోడ్లు ఎక్కడికక్కడ తెగిపోవడం, వరదలు పోటెత్తడంతో సహాయక చర్యలు వేగంగా సాగడం లేదు. కొండచరియలు విరిగిపడటం వల్ల జరిగిన ప్రాణనష్టంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సాయం చేస్తున్నామన్నారు. మరోవైపు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

30కిపైగా ఇళ్లు పూర్తిగా ధ్వంసం
రాయిగఢ్ జిల్లా మహాద్ తెహ్సిల్‌‌‌‌లోని తలయ్ గ్రామం దగ్గర్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 36 డెడ్ బాడీలను వెలికి తీసినట్లు అధికారులు చెప్పారు. గురువారం సాయంత్రం ప్రమాదం జరిగిందని, ఈ గ్రామంలో మరో 30కిపైగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, పదుల సంఖ్యలో శిథిలాల కింద చిక్కుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్ఎఫ్, స్థానిక డిజాస్టర్ మేనేజ్‌‌‌‌మెంట్ టీమ్స్ సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. వరద, బురద కారణంగా రోడ్లన్నీ మూసుకుపోయాయి. దీంతో ఘటనస్థలానికి సహాయక బృందాలు చేరుకోవడం కష్టతరంగా మారింది.

రెండు చోట్ల చిక్కుకున్న 20 మంది
సతారా జిల్లాలోని పటన్ తెహ్సిల్‌‌‌‌లో రెండు ప్రాంతాల్లో 20 మంది చిక్కుకున్నట్లు భావిస్తున్నామని ఎస్పీ అజయ్ కుమార్ బన్సాల్ చెప్పారు. ‘‘అంబేఘర్‌‌‌‌‌‌‌‌, మిర్గావ్ గ్రామాల్లో గురువారం రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శిథిలాల కింద కొన్ని ఇళ్లు కూరుకుపోయాయి. అంబేఘర్‌‌‌‌‌‌‌‌లోని నాలుగు ఇళ్లలో 13 లేదా 14 మంది.. మిర్గావ్‌‌‌‌లోని మూడు ఇళ్లలో 8 నుంచి 10 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి” అని వివరించారు.  

మహాబలేశ్వర్‌‌‌‌‌‌‌‌లో 3 రోజుల్లో 153 సెంటీమీటర్లు
సతారా జిల్లాలోని మహాబలేశ్వర్‌‌‌‌‌‌‌‌లో 24 గంటల వ్యవధిలో 59 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ ప్రాంతంలో ఇప్పటిదాకా ఇదే హయ్యెస్ట్ కావచ్చొని ఐఎండీ చెప్పింది. 

గోవండిలో కూలిన ఇల్లు.. నలుగురు మృతి
ముంబైలోని గోవండి శివాజీనగర్‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం ఉదయం ఇల్లు కూలిపోవడంతో నలుగురు చనిపోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. శిథిలాల నుంచి అధికారులు 15మందిని కాపాడారు.

హెలికాప్టర్లతో తరలింపు
వరద ప్రభావిత ప్రాంతాల్లో వేలాది మంది బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. వరద ప్రాంతాల్లో నేవీ నుంచి రెండు రెస్క్యూ బృందాలు, 12 లోకల్ రిలీఫ్ టీమ్స్, రెండు కోస్ట్‌‌‌‌గార్డ్‌‌‌‌ టీమ్స్, మూడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.