తిరుగుబాటు ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలి

తిరుగుబాటు ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలి
  • రెబల్స్ పై చట్టపరమైన చర్యలు ప్రారంభించిన శివసేన

మహారాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించడం లేదు. ఏక్ నాథ్ షిండే బృందంలో చేరిన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని మహారాష్ట్ర డీజీపీకి ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ లేఖ రాశారు. శివసేన ఎమ్మెల్యేలతో పాటు వారి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని లేఖలో ఆదేశించారు. ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ పై తిరుగుబావుటా ఎగురవేసిన ఏక్ నాథ్ షిండ్ తో పాటు ఆయన అనుచర ఎమ్మెల్యేలందరూ ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఉన్న ఓ హోటల్ లో ఉన్నారు. ఏక్ నాథ్ షిండేకి కంచుకోట అయిన థానేలో ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది. రాజకీయ సంక్షోభం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. జూన్ 30 వరకు ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉండనున్నాయి. 

మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రే కూడా రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. అసమ్మతి కూటమిలో చేరిన ఎమ్మెల్యేల భార్యలతో మాట్లాతున్నట్లు తెలుస్తోంది. వారి భర్తలను ఒప్పించి.. తిరిగి ముంబైకి వచ్చి ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతు తెలిపేలా మాట్లాడాలని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇటు రెబల్ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో షిండే బృందం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక రెబల్ ఎమ్మెల్యేలు బాల్ ఠాక్రే ప్రస్తావన తెస్తే చట్టపరమైన చర్యలకు దిగుతామని శివసేన జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 27లోగా తిరుగుబాటు ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వాలని ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఇటు మహారాష్ట్రలో శివసైనికుల ఆందోళన కొనసాగుతోంది. రెబల్స్ ఎమ్మెల్యేల కార్యాలయాలపైనా దాడులు చేస్తున్నారు. మరో వైపు తాము శివసేన పార్టీని వీడలేదని ఏక్ నాథ్ షిండే ప్రకటించారు. పార్టీలో ప్రత్యేక బృందంగా ఉంటామన్నారు. శివసేన బాలాసాహెబ్ అధ్యక్షుడిగా ఏక్ నాథ్ షిండేను ఎన్నుకుంటున్నామన్నారు. 

ముదురుతున్న సంక్షోభం 

తిరుగుబాటు ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు శివసేన నిర్ణయించింది. ఇందులో భాగంగానే 16 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గం చర్యలు చేపట్టగా.. తమ వర్గాన్ని ‘శివసేన బాలాసాహెబ్’ పేరుతో పిలవాలని రెబెల్ లీడర్ ఏక్ నాథ్ షిండే ప్రకటించారు. గొడవ సద్దుమణిగే పరిస్థితి లేకపోవడంతో షిండే వర్గం ఎమ్మెల్యేలు ఇంకా గౌహతిలోని హోటల్ లోనే క్యాంపును  కొనసాగిస్తున్నారు. సంక్షోభంపై ఒక క్లారిటీ వస్తే తప్ప వారు ముంబైకి తిరిగి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు శివసేన తమదంటే తమదే అంటున్న రెండు వర్గాలు న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నాయి. 

రెబెల్స్ కు నోటీసులు  

రెబెల్స్ పై చర్యలు తీసుకునే అధికారాన్ని ఠాక్రేకు అప్పగిస్తూ శివసేన ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానాన్ని ఆమోదించింది. శివసేన, బాల్ ఠాక్రే ఒకే నాణేనికి రెండు వైపులు అని, బాలా సాహెబ్ పేరును ఇతరులు ఎవరూ వాడుకోరాదంటూ కమిటీ మరో తీర్మానం కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఏక్ నాథ్ షిండేతో సహా తిరుగుబాటు చేసిన 16 మంది శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి సీతారం జీర్వాల్ అనర్హత నోటీసులు పంపారు. పార్టీ లెజిస్లేటర్ల మీటింగ్ కు హాజరు కానందున ఎందుకు డిస్ క్వాలిఫై చేయకూడదో సోమవారం (జూన్ 27) లోపు వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.   

సెక్యూరిటీపై ఉద్ధవ్ ఠాక్రేకు షిండే లేఖ  

మహారాష్ట్రలో ఉన్న తమ వర్గం ఎమ్మెల్యేల కుటుంబాలకు పోలీసులు సెక్యూరిటీ తొలగించడంపై ఏక్ నాథ్ షిండే ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అందరు పోలీస్ కమిషనర్లు దురుద్దేశపూర్వకంగానే సెక్యూరిటీని తొలగించారని ఆరోపిస్తూ ఉద్ధవ్ థాక్రేకు లేఖ రాశారు. రెబెల్ ఎమ్మెల్యేలు, వారి కుటుంబసభ్యులపై దాడులు చేసేలా ఎంవీఏ కూటమి నేతలు తమ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. ఇటీవల పంజాబ్ లో ప్రముఖులకు సెక్యూరిటీని తొలగించిన వెంటనే వారిపై గూండాలు, గ్యాంగ్ స్టర్లు దాడులు చేశారని, మహారాష్ట్రలోనూ ఇలాంటివి జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రభుత్వం సెక్యూరిటీ కల్పిస్తుందని, వారి కుటుంబాలకు కాదన్నారు.