100 కోట్లు వసూలు చేయమని హోంమంత్రే చెప్పారు

100 కోట్లు వసూలు చేయమని హోంమంత్రే చెప్పారు

ముంబై: మహారాష్ట్ర హోం మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌‌ముఖ్ పై ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వ్యవహారంలో కొద్దిరోజుల క్రితం బదిలీ అయిన ఈయన స్వయంగా సీఎంకు లేఖ రాయడం మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వ్యవహారంలో విచారణ సరిగ్గా చేయడం లేదంటూ హోంగార్డు కమాండెంట్‌గా పరంబీర్ సింగ్‌‌ను బదిలీ చేశారు. 

కాగా తన బదిలీ సాధారణ పరిపాలన వ్యవహారాల్లో భాగంగా జరిగినట్లు చెప్పుకున్నా.. అసలు విషయం మాత్రం హోం మంత్రి నిర్దేశించిన వసూళ్ల దందానే కారణమని.. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వాహనం విషయంలో అరెస్టయిన వాజేను నెలకు 100 కోట్లు తెమ్మని హోం మంత్రి ఒత్తిడి చేశారని.. మంత్రి చెప్పిన సమయంలో ఆయన అనుచరులూ అక్కడే ఉన్నారని పరంబీర్ సింగ్ పేర్కొన్నారు. ‘ముంబైలో 1,750 బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. అలాగే కొన్ని నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఈ బార్లు, రెస్టారెంట్లు, ప్రాపర్టీల నుంచి ప్రతినెలా రూ.2 నుంచి 3 లక్షలు వసూలు చేయాలని చెప్పారు. దీని వల్ల నెలకు రూ.40 నుంచి 50 కోట్ల వరకు వసూల్ అవుతాయి’ అని పరంబీర్ బయటపెట్టారు.