ఉత్కంఠ రేపుతున్న మహారాష్ట్ర పాలిటిక్స్

ఉత్కంఠ రేపుతున్న మహారాష్ట్ర పాలిటిక్స్

ముంబై: మంత్రి ఏక్ నాథ్ షిండే శివసేన అధిష్ఠానానికి ఎదురు తిరగడంతో అక్కడి రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఏక్షణమైనా మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఏక్ నాథ్ షిండే ప్రకటించారు. షిండే క్యాంప్ లో రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య 50 చేరువయింది. అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని షిండే ప్రకటన చేశారు. ఏక్ నాథ్ షిండే క్యాంపులోకి మరో ముగ్గురు శివసేన శాసన సభ్యులు చేరుకున్నారు. ప్రస్తుతం 39 మంది శివసేన ఎమ్మెల్యేలు షిండేకు మద్దతు తెలిపారు. శాసనసభా పక్ష హోదా కల్పించాలని కోరుతూ డిప్యూటీ స్పీకర్, గవర్నర్, శాసనమండలి సెక్రెటరీకి షిండే లేఖ రాశారు. 37 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన కాపీలను డిప్యూటీ స్పీకర్, గవర్నర్లకు పంపారు. శివసేన ఎమ్మెల్యే భరత్ గోగవాలేను పార్టీ చీఫ్ విప్ గా సునీల్ ప్రభు స్థానంలో నియమిస్తున్నట్లు లేఖలో షిండే పేర్కొన్నారు.

ఇటు శివసేన భవన్ లో ముఖ్యనేతలతో ఉద్దవ్ థాక్రే సమావేశం ముగిసింది. సీఎం, పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తానని ఉద్దవ్ థాక్రే సమావేశంలో అన్నట్లు తెలుస్తోంది. రెబల్స్ ని దారికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలని ముఖ్యనేతలకు ఉద్దవ్ సూచించినట్లు సమాచారం. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరని శివసేన నేతలు సమావేశంలో ప్రకటించారు.  అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో థాక్రే సర్కార్ విజయం సాధిస్తుందని  సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు.  తమను వీడిన ఎమ్మెల్యేలు తిరిగి పార్టీ గూటికి చేరేలా అవకాశం ఇచ్చామన్నారు. ప్రస్తుతం అసోం క్యాంప్ లో ఉన్న ఎమ్మెల్యేలు ముంబైకి రావాలని డిమాండ్ చేశారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోకుండా ప్రయత్నాలు చేస్తున్న శరద్ పవార్ పై ఓ కేంద్ర మంత్రి దురుసు వ్యాఖ్యలు చేశారని సంజయ్ రౌత్ ఆరోపించారు. బీజేపీ క్రమశిక్షణ ఇదేనా అంటూ ట్విట్టర్ లో ప్రధాని మోడీ, అమిత్ షాను ప్రశ్నించారు. 

తాజా రాజకీయ పరిణామాలను ఎన్సీపీ, కాంగ్రెస్ నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఈ విషయాన్ని  శివసేన అంతర్గత సమస్యగా ఎన్సీపీ భావిస్తోంది. ఆ పార్టీ నేతలు సాయంత్రం ఉద్దవ్ థాక్రేతో భేటీ కానున్నారు. తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఎన్సీపీ నేత అజిత్ పవార్ స్పష్టం చేశారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని చివరి వరకు మద్దతిస్తామని ఆయన తెలిపారు