గుజరాత్ కు మారిన ‘మహా’ పాలిటిక్స్ 

గుజరాత్ కు మారిన ‘మహా’ పాలిటిక్స్ 
  • శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు
  • షిండేతో చర్చలకు సూరత్ కు మంత్రిని పంపించిన ఠాక్రే
  • శాసనసభా పక్షనేత పదవి నుంచి ఏక్ నాథ్ షిండే తొలగింపు
  • షిండే స్థానంలో శివాడీ ఎమ్మెల్యే అజయ్ చౌదరి నియామకం
  • బాల్ ఠాక్రే బోధనలను వదిలిపెట్టనంటూ షిండే ట్వీట్ 
  • మహారాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడిగా కమల్ నాథ్ 

మహారాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం గుజరాత్ కేంద్రంగా పాలి‘టిక్స్’ నడుస్తున్నాయి. శివసేన అగ్రనేత, మంత్రి ఏక్‌నాథ్‌ షిండేతో పాటు 30మందికిపైగా ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో అసంతృప్త ఎమ్మెల్యేలందరూ గుజరాత్ రాష్ర్టానికి తరలివెళ్లారు. దీంతో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ప్రమాదంలో పడింది. మరోవైపు శివసేన రెబెల్ ఎమ్మెల్యేల క్యాంప్(మంత్రి ఏక్‌నాథ్‌ షిండే)లో మిగతా ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం గుజరాత్ సూరత్ లో ఏక్ నాథ్ షిండే వెంట దాదాపు 30 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. గుజరాత్ లోని సూరత్ లో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ (మెరిడియన్)లో షిండేతో పాటు అనుచర ప్రజాప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది. షిండే వెంట శివసేన ఎమ్మెల్యేలతో సహా పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మహా వికాస్ అఘాడి ప్రభుత్వం నుంచి బయటకు రావాలని షిండే వారిపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఏక్ నాథ్ షిండేతో చర్చించేందుకు మరో మంత్రి మిలింద్ నర్వేకర్ ను ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సూరత్ కు పంపించారు. మధ్యాహ్నం జరిగిన శివసేన శాసనసభా పక్ష సమావేశానికి కేవలం 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. మహారాష్ట్రలో శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

బాల్‌థాక్రే ప్రియ శిష్యుడిని : ఏక్ నాథ్ షిండే  


మరోవైపు మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభనకు కేంద్ర బిందువుగా మారిన మంత్రి ఏక్ నాథ్ షిండే ను శాసనసభా పక్షనేత పదవి నుంచి శివసేన తొలగించింది. ఆయన స్థానంలో శివాడీ ఎమ్మెల్యే అజయ్ చౌదరిని నియమించింది.

మరోవైపు.. అధికారం కోసం తాను మోసం చేయనంటూ ఏక్ నాథ్ షిండే మరాఠీలో ట్వీట్ చేశారు. తాజా సంక్షోభం నేపథ్యంలో తొలిసారి స్పందించిన ఆయన..బాల్ ఠాక్రే బోధనలను తాను వదిలిపెట్టబోనని చెప్పారు.‘బాలాసాహెబ్ కు మేం విధేయులమైన శివసైనికులం. ఆయనే మాకు హిందుత్వ పాఠాలు బోధించారు. అధికారం కోసం మేం మోసం చేయం. బాలాసాహెబ్, ఆనంద్ దిఘే పాఠాలను మరిచిపోం’ అని మరాఠీలో ట్వీట్ చేశారు. శాసనసభా పక్షనేత హోదా నుంచి తప్పించిన నేపథ్యంలో ట్విట్టర్ బయో నుంచి 'శివసేన' అన్న పదాన్ని షిండే తొలగించారు. గత కొంతకాలంగా శివసేన పార్టీపై అసంతృప్తిగా ఉన్న షిండే.. తన మద్దతుదారులతో  కలిసి బీజేపీలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ముప్పేమీ లేదు : కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ సైతం అఘాడీ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని అభిప్రాయపడింది. సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ను మహారాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడిగా నియమించింది.

బీజేపీ తీరుపై ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం
ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ‘మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాలలో మాదిరిగానే పడగొట్టడానికి కుట్ర జరుగుతోంది’ అని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహారాష్ట్రలో శివసేన పార్టీని బలహీరపరిచేందుకు బీజేపీ అన్ని విధాలుగా కుట్రలు చేస్తోందని ఆరోపించారు.