
అశ్లీల వీడియోల బోధన అంటే, సెక్స్ ఎడ్యుకేషన్ ఏమో అనుకోకండి.. అస్సలు కాదు.. వీడో నీచుడు. వయసు మీద పడినప్పటికీ తన శృంగార సాహిత్యాన్ని మరవలేకపోయాడు. పనిచేస్తున్న పాఠశాల విద్యార్థినులపై కన్నేశాడు. గత నాలుగు నెలలుగా వారికి పుస్తక పాఠాలు బోధించడం మానేసి అస్తమానం శృంగార వీడియోల కథలు చెప్తున్నాడు. ఆ సమయంలో వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, ఎక్కడపడితే అక్కడ చేతులేస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడు. అతని వేధింపులు భరించలేని ఓ విద్యార్థిని ఈ విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పడంతో అతని పాపం పండింది. ఈ ఘటన మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో చోటు చేసుకుంది.
విద్యార్థినిలకు అశ్లీల కంటెంట్‌ను చూపిస్తూ వారిని అనుచితంగా తాకినట్లు ఆరోపణలపై 47 ఏళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని పేరు.. ప్రమోద్ సర్దార్. గత నాలుగు నెలలుగా ఉపాధ్యాయుడు తమకు అసభ్యకరమైన వీడియోలు చూపిస్తున్నారని ఆరుగురు బాలికలు ఫిర్యాదు చేశారు. అశ్లీల వీడియోలు చూపించే సమయంలో తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు అందగానే కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటన అనంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు మంగళవారం(ఆగష్టు 20) ఉదయం పాఠశాలను సందర్శించి కొంతమంది బాలికలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు ఆశా మిర్గే డిమాండ్ చేశారు.