ఇస్రోలో సైంటిస్ట్‌గా ఎంపికైన రైతు కొడుకు

ఇస్రోలో సైంటిస్ట్‌గా ఎంపికైన రైతు కొడుకు

ఓ రైతు కొడుకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో సీనియర్ శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని  పంధర్‌పూర్ మండలంలోని సర్కోలి గ్రామానికి చెందిన  సోమనాథ్ ఈ ఘనతను సాధించాడు. అతని తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ సోమనాథ్‌ను చదివించారు. మహారాష్ట్ర నుంచి ఇస్రోకు ఎంపికైన మొదటి వ్యక్తి సోమనాథ్. దాంతో ఇప్పుడు సోమనాథ్ పేరు మహారాష్ట్రలో మారుమోగుతుంది. దాంతో అతని తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కేరళలోని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్తగా సోమనాథ్ ఎంపికైనట్లు జూన్ 2న కాల్ లెటర్ వచ్చింది. సోమనాథ్ గ్రామమైన సర్కోలిలో పండగ వాతావరణం నెలకొంది. తమ గ్రామానికి చెందిన యువకుడు.. ఇస్రోలో జాబ్ సాధించడంపట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇస్రోలో జాబ్ సాధించిన సందర్భంగా సోమనాథ్ మాట్లాడుతూ.. ‘ఇటీవల నేను ఇస్రోలో సీనియర్ సైంటిస్ట్‌గా ఉద్యోగం పొందాను. ఢిల్లీ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాను. ఆ తర్వాత మెకానికల్ డిజైన్‌ కోర్సును అభ్యసించాను. నేను 2016లో ఇస్రోలో ఉద్యోగం  కోసం అప్లై చేశాను. కానీ, అప్పుడు రాత పరీక్షలలో అర్హత సాధించలేకపోయాను. అయితే 2019లో, నా ఎంటెక్ డిగ్రీ ఆధారంగా.. నేను ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాను. నేను సీనియర్ సైంటిస్ట్‌గా సెలక్ట్ అయినట్లుగా జూన్ 2, 2021న కాల్ లెటర్ వచ్చింది’ అని తెలిపాడు.

సోమనాథ్ తన గ్రామంలోని జిల్లా పరిషత్ స్కూల్‌లోనే 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత పంధర్‌పూర్‌లోని కేబీపీ కాలేజీలో ఇంటర్ పూర్తిచేశాడు. ఢిల్లీ ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత గేట్‌లో 916వ ర్యాంకు సాధించి.. అదే ఇనిస్టిట్యూట్‌లో విమాన ఇంజిన్ డిజైన్‌లో పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. సోమనాథ్ అక్కడ పనిచేస్తూనే ఇస్రోలో సైంటిస్ట్ ఉద్యోగం కోసం ప్రయత్నించి విజయం సాధించాడు.