మేడిగడ్డ బ్యారేజీకి వ్యతిరేకంగా మళ్లీ పోరుబాట పట్టిన మహారాష్ట్ర రైతులు

మేడిగడ్డ బ్యారేజీకి వ్యతిరేకంగా మళ్లీ పోరుబాట పట్టిన మహారాష్ట్ర రైతులు

జయశంకర్‌‌ భూపాలపల్లి, మహాదేవ్‌‌పూర్‌‌, వెలుగు:  మేడిగడ్డ బ్యారేజీకి వ్యతిరేకంగా మహారాష్ట్ర రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. వరసగా వారం రోజుల పాటు ఆందోళన చేపట్టాలని ప్లాన్​ చేశారు. బ్యారేజీ నీటితో మునుగుతున్న తమ పొలాలకు ఎకరానికి రూ 20 లక్షలు  నష్ట పరిహారం చెల్లించి భూసేకరణ చేయాలని డిమాండ్‌‌ చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో సోమవారం సిరోంచాలో మేడిగడ్డ ముంపు గ్రామాల రైతులు ధర్నా చేశారు.  ఈ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్‌‌ విధించారు. 

వెయ్యి ఎకరాలు మునుగుతున్నాయ్​

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మహాదేవ్‌‌పూర్‌‌ మండలంలో మేడిగడ్డ బ్యారేజీ నిర్మించింది. ఆ సమయంలో మహారాష్ట్ర వైపు ఎకరానికి రూ.10.5 లక్షల చొప్పున చెల్లించి భూసేకరణ చేసింది.  అయితే బ్యారేజీ పూర్తయి ..  నీటిని నిల్వ చేయగా  సిరోంచా తాలుకాలోని అంకీస, అరుడ, సిరోంచా, పోచంపల్లి, రజన్నపల్లి, మడ్డికుంట, జానంపల్లి,  చింతల పల్లి, ముగాపూర్, మృదు కృష్ణా పూర్,  కారస్ పల్లి,   రామకృష్ణ పూర్ గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి ఎకరాలు  మునుగుతున్నాయి.  ఈ గ్రామాల రైతులు మూడేళ్లుగా తమకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి వ్యతిరేకంగా సెప్టెంబర్‌‌, అక్టోబర్‌‌ నెలలలో ఆందోళన చేపట్టిన అక్కడి రైతులు  సీఎం కేసీఆర్‌‌ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. దీంతో మహారాష్ట్ర  ప్రభుత్వం అక్టోబర్‌‌ చివరి వారంలో ముంపు భూముల సర్వే నిర్వహించింది.   అయినా.. ఇప్పటికీ తెలంగాణ సర్కారు నుంచి  భూసేకరణపై  స్పష్టమైన హామీ రాకపోవడంతో మహారాష్ట్ర  రైతులు  సోమవారం మళ్లీ పోరుబాట పట్టారు.సిరోంచా తాలుకా కేంద్రంలో ధర్నా చేసేందుకు సిద్దపడ్డారు. మహారాష్ట్ర సర్కారు  గడ్చిరోలి జిల్లాలో ఆంక్షలు విధించింది.  ముంపునకు గురవుతున్న 12 గ్రామాల నుంచి సుమారు 15 వందల మంది రైతులు సిరోంచాకు చేరుకోగా..   144 సెక్షన్‌‌ అమలులో ఉందంటూ  కేవలం 4 రైతులకు మాత్రమే టెంట్​లో కూర్చునేందుకు పర్మిషన్‌‌ ఇచ్చారు. ర్యాలీకి  అనుమతి ఇవ్వలేదు.   

పరిహారంపై తకరారు

మేడిగడ్డ బ్యారేజీలో  ఎఫ్ఆర్ఎల్ వరకు నీరు ఉన్నప్పుడు మహారాష్ట్ర వైపు 143.99 హెక్టార్ల భూమి  ముంపునకు గురవుతోందని  మహారాష్ట్ర  ప్రభుత్వం ఇటీవల చేసిన సర్వేలో గుర్తించింది.ఈ మేరకు రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణ  రెవెన్యూ ఆఫీసర్లు ఎకరానికి 2.5 నుంచి 3 లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పగా.. అక్కడి  రైతులు అంగీకరించలేదు. పెరిగిన భూముల ధరలకు అనుగుణంగా ఎకరానికి రూ.20 లక్షలు ఇవ్వాలని వారు డిమాండ్​ చేస్తున్నారు.