హైదరాబాద్ షాద్ నగర్ లో దారుణం జరిగింది. తమ్ముడి కులాంతర వివాహానికి సహకరించాడని అన్నను దారుణంగా కొట్టి చంపి.. మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. షాద్ నగర్ లోని ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ తమ్ముడు చంద్రశేఖర్ అదే గ్రామానికి చెందిన భవాని అనే యువతిని ప్రేమించాడు. వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించరని భావించి 10 రోజుల కిందట ఊరు నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకొని హైదరాబాద్‌లో ఉంటున్నారు.
చంద్రశేఖర్, భవానిల పెళ్ళికి సహకరించింది యువకుడి అన్న రాజశేఖర్ అని భావించి కక్ష పెంచుకున్నారు యువతి బంధువులు.
నవంబర్ 12న మాట్లాడుకుందామని, సంధి కుదుర్చుకుందామని నలుగురు వ్యక్తులు రాజశేఖర్‌ను నమ్మించి గ్రామ శివారుకు తీసుకెళ్లారు. ఆక్కడ ఆయన్ను తీవ్రంగా కొట్టి చంపారు. తర్వాత మృతదేహాన్ని కారులో మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎన్మనగండ్ల గేటు వద్దకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టారు.
రాజశేఖర్ కుటుంబ సభ్యులు షాద్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తండ్రితో పాటు అనుమానం ఉన్న పలువురి పేర్లను పోలీసులకు ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
