తెలంగాణలో ఇవాళ ఒమిక్రాన్‌ కేసులు జీరో

తెలంగాణలో ఇవాళ ఒమిక్రాన్‌ కేసులు జీరో

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. ఇవాళ ఒక్క రోజులోనే పలు రాష్ట్రాల్లో భారీగా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో కొత్త 33 కేసులు రాగా.. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 34కు చేరిందని తమిళనాడు సర్కారు తెలిపింది. ఇక మహారాష్ట్రలో ఇవాళ 23 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ  వెల్లడించింది. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసులు సంఖ్య 88కు చేరింది. దేశంలోనే అత్యధిక ఒమిక్రాన్ కేసులు ఉన్న రాష్ట్రం ఇదే.

కర్ణాటకలో ఇవాళ12 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 10 కేసులు బెంగళూరులో రాగా... మంగళూరు, మైసూరులలో ఒక్కోటి నమోదయ్యాయి. దీంతో కర్ణాటకలో కేసుల సంఖ్య 31 కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ తెలిపారు. కేరళలో ఐదుగురికి ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలిందని, దీంతో రాష్ట్రంలో ఈ కేసుల సంఖ్య 29కి చేరిందని కేరళ హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ చెప్పారు. ఇక గుజరాత్‌లో ఇవాళ 7 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 30కి చేరింది.

ఇవాళ తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాకపోవడం రాష్ట్రానికి కొంత ఊరటనిచ్చే అంశం. ఇవాళ రాష్ట్రంలో టెస్ట్ చేసిన అన్ని శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఒమిక్రాన్‌ నెగెటివ్ వచ్చాయి. కాగా, ఈ ఒక్క రోజులో తెలంగాణలో మొత్తం 177 కరోనా కేసులు నమోదు కాగా.. ఒకరు మరణించారు.