V6 News

మహత్మా జ్యోతిభా ఫూలే సామాజిక విప్లవ యోధుడు

మహత్మా జ్యోతిభా ఫూలే సామాజిక విప్లవ యోధుడు

సమాజంలో ఆధిపత్యాలు, అన్యాయాలు, అక్రమాలు పెచ్చరిల్లుతున్నప్పుడు ఎవరో ఒకరు సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా చూస్తూ పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు, ఆత్మ గౌరవ స్ఫూర్తి పతాకం మహాత్మ జ్యోతిభా పూలే. అసమానం, అస్పృశ్యత, అణచివేయబడి న్యాయం దక్కని సామాజిక వర్గాల హక్కులకై పోరాడిన త్యాగమూర్తి. వీధిలో నడవడం, ఉమ్మడం కూడా నేరమైన కుల సమాజాన్ని ఎదిరించిన సాంఘిక విప్లవకారుడు ఫూలే.

 మహారాష్ట్రలో చిమ్నాబాయి – గోవిందరావు దంపతులకు 11 ఏప్రిల్ 1827లో జన్మించాడు. ఆయనకు వెలుగుకు సూచనగా జ్యోతి అని పేరు పెట్టారు. ప్రజలు ఇష్టంగా జోతిభా, జోతిరావు అని పిలుచుకుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫూలే ఈ ఏడు 200వ జయంతి ఉత్సవాలు ఏడాదంతా జరపాలి. భారతరత్న ప్రకటించి గౌరవించాలి. స్వతంత్ర భారతదేశంలో నేటికీ దేవాలయ ప్రవేశాల వెలివేతలు, కుల హత్యలు, పరువుహత్యలు, కులవివక్షలు, అణచివేతలు నిత్యకృత్యమే. సమాన అవకాశాల కోసం సమ న్యాయం కోసం నిరంతరం పోరాడిన ఫూలేను అణగారిన, పీడిత బహుజన వర్గాలు స్ఫూర్తిగా తీసుకొని హక్కుల కోసం ఉద్యమించాలి. 
ఆధునిక భారతదేశంలో విద్య ప్రాముఖ్యతను తెలియజేస్తూ1848 లో నిమ్నకులాల బాలబాలికలకై మొట్టమొదటి పాఠశాల ప్రారంభించిన భారతీయుడు ఫూలే. విద్యనే వికాసమన్న తొలి సంస్కర్త. 20కి పైగా కింది వర్గాలవారి కోసం పాఠశాలలు ఏర్పాటు చేసి, అట్టడుగు కుటుంబాలకు విద్యను అందించిన జ్ఞానమూర్తి. దళితుల కోసం పాఠశాలలు ఏర్పాటు చేసి చదువు చెప్పాడు. కింది వర్గాలు చదివితే అరిష్టమని ఫూలే తండ్రి (గోవిందరావు ఫూలే)కు మాయమాటలు చెప్పి ఫూలే దంపతులను ఇంట్లో నుంచి బయటికి నెట్టేశాడు.

భారతదేశంలో అట్టడుగు వర్గాల వారికి అణిచివేతకు గురైన పీడితులకు, స్త్రీలకు నూతన యుగ ద్వారాలు తెరిచిన మహనీయుడు. స్త్రీల గురించి మాట్లాడిన మొదటి స్త్రీ వాద సిద్ధాంతకర్త. నూట ఎనభై ఏళ్ల కిందనే అంటరానితనం, కుల వ్యవస్థపై ఉద్యమించాడు. అతిశూద్రులు, నిమ్న జాతుల వారికి తన ఇంటిలోని చేదురు బావి నీళ్లను ఇచ్చిన ఆదర్శనీయుడు. అతిశూద్ర, శూద్రుల పిల్లలకు చదువు నేర్పించాడు. అనాథల కోసం ఆశ్రమాలు, స్త్రీ విద్యకు ప్రాధాన్యత, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించాడు. బాల్య వివాహాలు వితంతువులకు జుట్టు తీయించడం వంటి మూఢాచారాలను ఖండించి మానిపించాడు. పురోహిత వ్యవస్థ వర్ణ వ్యవస్థలపై తీవ్రంగా ప్రతిఘటించాడు.

బ్రాహ్మణ మిత్రుని వివాహానికి హాజరై బ్రాహ్మణులచే అవమానించబడ్డాడు. బ్రాహ్మణాధిపత్యంపై తిరుగుబాటుకు తొలి పోరాటం ఇక్కడినుంచే ప్రారంభమైంది. సమాజంలో రెండు వర్గాలు అధిక దోపిడీకి, పీడనకు గురవుతున్నాయి. ఒకటి స్త్రీ, రెండు దళిత వర్గాలు. ఈ రెండు వర్గాల ఉన్నతిని కోరి తన జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు జ్యోతిరావు ఫూలే. అందుకే ఆయన మొట్టమొదటిసారిగా మహిళా పాఠశాలలను ప్రారంభించాడు. అందులో భాగంగానే తన భార్య సావిత్రిబాయికి చదువు నేర్పించి మొదటి ఉపాధ్యాయురాలుగా మార్చాడు. 

బ్రాహ్మణీయ వ్యవస్థ మనువాద శాస్త్రాలపై అత్యంత తిరుగుబాటుగా 1873లో ‘‘గులాంగిరి” గ్రంథాన్ని రాశాడు. తృతీయ రత్న, సార్వజనిక సత్యధర్మ పుస్తక, బ్రాహ్మణంచే కసబ్ లాంటి ఎన్నో రచనలను అందించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మ జ్యోతిరావు ఫూలేను తన గురువుగా ప్రకటించుకున్నాడు.

తాను నడుపుతున్న శరణాలయంలోని ఒక వితంతువు (కాశీబాయి) కొడుకును 1874లో ఫూలే దంపతులు దత్తత తీసుకొని యశ్వంత్​రావు అని పేరు పెట్టారు. ఉన్నత విద్యలు చదివించారు. అతను బ్రిటిష్ సైన్యంలో సర్జన్​గా పనిచేశాడు. అనంతరం మహమ్మారి ప్లేగు వ్యాధిగ్రస్తులకు తల్లి సావిత్రిబాయి ఫూలేతో కలిసి వైద్య సేవలు అందించాడు. 1875లో ‘సత్యశోధక్ సమాజ్’ సంస్థను ఏర్పాటు చేశాడు. పురోహితుడు లేకుండా పెళ్లి చేయడం ప్రారంభించాడు. పేద వర్గాల వారికి చదువు, సంక్షేమం, సాయం ఎన్నో అవకాశాల కోసం ఆనాడు ఫూలే ఉద్యమించాడు. స్త్రీ, పురుషులు సమానమని, హక్కులు సమానమని ఆనాడు ఫూలే మహత్తర పోరాటం చేశాడు. సామాజిక, సాంఘిక అసమానతలపై సత్యశోధక్ సంస్థ నిరంతరం పోరాడుతూ భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనంలో సత్యశోధక్ పాత్ర గణనీయమైనది. 

పూనా పట్టణంలో ఏర్పడిన తీవ్రమైన కరువును ఎదుర్కోవడానికి 52 ఉచిత భోజన కేంద్రాలను ఏర్పాటుచేశాడు. దీనబంధు పత్రిక స్థాపించి శూద్రుల తరఫున ప్రధాన గొంతుకై నిలిచాడు. డ్యూక్ ఆఫ్ కన్నాట్ దొర రైతుల కోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చినిగిన ధోతి, మాసిపోయిన చొక్కా, మాసిన రుమాలు తలకు చుట్టి భుజం మీద పాత గొంగడి ధరించి సాధారణ రైతు వేషంలో ఆంగ్లేయుల పాలనలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను కన్నాట్ దొర దృష్టికి తీసుకెళ్లాడు. ఆంగ్లంలో ప్రసంగించాడు. ‘‘అయ్యా మా దేశంలో రైతులు ఏ విధంగా ఉన్నారో తెలియజేయడానికే నేను ఇలా వచ్చాను. రైతులకు కడుపునిండా తిండి లేదు. మీరు ఇంగ్లాండ్​కు వెళ్లి మీ అమ్మగారైన విక్టోరియా మహారాణికి తెలియజేసి మా ఆర్థిక పరిస్థితిని వివరించండి”అన్నాడు. నూట యాభై ఏళ్ల కిందనే శూద్ర, అతిశూద్రుల విద్యకోసం అధిక ధనాన్ని ఖర్చు చేయాలంటూ హంటర్ కమిషన్ ముందు డిమాండ్ చేశాడు. చీకటి జీవితాలలో జ్ఞాన దీపం వెలిగించినందుకు కృతజ్ఞతగా ప్రజలే స్వచ్ఛందంగా ఆయనను 1888 మే 11న పూనాలో పౌర సన్మానం ఏర్పాటు చేసి ‘మహాత్మా’ అనే బిరుదుతో సత్కరించుకున్నారు.

అట్టడుగు కులాల బానిసత్వ విముక్తికై చైతన్యాన్ని రగిలించిన జోతిభా1889 నవంబర్ 28న తుదిశ్వాస విడిచారు. మరణించేంతవరకు ఇరవైకి పైగా పాఠశాలలు ఏర్పాటు చేసి అతిశూద్ర, శూద్ర వర్ణాల విద్య కోసం తీవ్రంగా శ్రమించిన పోరాటయోధుడు.

జ్యోతిభాపూలే 200వ జయంతి సందర్భంగా ఆయన పేరున యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ, జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలి. ఏడాది వయస్సులోనే తల్లిని కోల్పోయి 27 ఏళ్లకే ఇంటి నుంచి గెంటేయబడి 47 ఏళ్లు సమానత్వం, సమాన హక్కులు, సామాజిక న్యాయం కోసం ఉద్యమించిన పోరాటయోధుడు ఫూలే. అందరూ సమానమన్న సత్యాన్ని చారిత్ర సాక్షాధారాలతో వివరించిన తాత్వికుడు. జోతిభా ఫూలే జీవితం అద్భుతమైన గ్రంథం. ఆయన ఆశయాల సాధననే ఫూలేకు ఘనమైన నివాళులు.


- వనపట్ల సుబ్బయ్య
నాగర్ కర్నూల్ 

లైఫ్​& లిటరేచర్​ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్​ ఐడీ featureseditor@v6velugu.com