మహాత్ముడి కలల్ని నిజం చేశాం : మోడీ

మహాత్ముడి కలల్ని నిజం చేశాం : మోడీ

దేశం ‘ఓపెన్​ డెఫికేషన్​ ఫ్రీ’గా మారడమే నిదర్శనం
మహాత్ముడి 150వ జయంతి వేడుకల్లో ప్రధాని మోడీ
ప్రపంచానికి గైడింగ్​ లైట్​ గాంధీనే అంటూ వ్యాసం
రాజ్​ఘాట్​ వద్ద బాపూజీకి, విజయ్​ఘాట్​ వద్ద
లాల్​బహదూర్​ శాస్త్రికి ప్రముఖుల నివాళులు
సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన మోడీ.. ‘స్వచ్ఛభారత్​ దివస్’లో ప్రసంగం
గాంధీ పేరుతో రూ.150 కాయిన్​ విడుదల

న్యూఢిల్లీ/అహ్మదాబాద్: గాంధీజీ కలలు కన్న స్వచ్ఛభారత్​ను నిజం చేసి చూపించామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బాపూజీ 150వ జయంతినాడే దేశాన్ని ఓపెన్​ డెఫికేషన్​ ఫ్రీగా ప్రకటించడమే అందుకు నిదర్శనమని చెప్పారు.‘‘పారిశుద్ధ్యం, పర్యావరణం, సాధుజంతువులు.. ఈ మూడూ మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన విషయాలు. అప్పట్లో గాంధీజీ పిలుపు మేరకు సత్యాగ్రహ ఉద్యమంలో లక్షలాదిగా పాల్గొన్న దేశప్రజలు.. ఇవాళ్టి స్వచ్ఛాగ్రహ ఉద్యమంలోనూ అదే స్ఫూర్తిని కనబర్చారు. మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా ఆయన ‘స్వచ్ఛభారత్​’ కల నిజమైన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇండియాను ఓపెన్​ డెఫికేషన్​ ఫ్రీ దేశంగా ప్రకటించడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. గాంధీకి ఇష్టమైన మూడు విషయాలూ ప్లాస్టిక్​ వల్ల తీవ్రంగా ఎఫెక్ట్​ అవుతున్నాయి కాబట్టే దాన్ని నిషేధించాం.

2022 నాటికి దేశంలో సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ని పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం”అని వివరించారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం అహ్మదాబాద్​లోని సబర్మతి ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో ఆయనీ కామెంట్లు చేశారు. అంతకు ముందు ఢిల్లీలోని ‘రాజ్​ఘాట్​’ వద్ద జాతిపితకు నివాళులర్పించిన ప్రధాని.. గాంధీ కలల్ని సాకారం చేసే దిశగా సాగుతూ మెరుగైన సమాజాన్ని నిర్మించుకుందామని అన్నారు. ప్రధాని కంటే ముందు రాష్ట్రపతి రాంనాథ్​ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు​ రాజ్​ఘాట్​ వద్ద మహాత్ముడికి నివాళులర్పించారు. బాపూజీ చెప్పిన విలువలు నేటికీ ఆచరణీయమని, ఆయన చూపిన బాటలో పయనిద్దామని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. బుధవారం మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా కావడంతో విజయ్‌ఘాట్ వద్ద ఆయనకు నేతలు నివాళులర్పించారు.

ప్రపంచ వేదికపై మన ప్రతిష్ట పెరిగింది: మోడీ

రాజ్​ఘాట్​లో నివాళులర్పించిన తర్వాత ఢిల్లీ నుంచి గుజరాత్​కు వచ్చిన ప్రధాని మోడీ అహ్మదాబాద్​లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అహ్మదాబాద్​ ఎయిర్​పోర్టు వద్ద బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వేదికపై ఇండియా ప్రతిష్ట పెరిగిందని, ప్రతి ఒక్కరూ ఈ మార్పును స్పష్టంగా చూస్తున్నారని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం అన్ని దేశాలూ ఇండియావైపే చూస్తున్నాయని చెప్పారు. ఎయిర్​పోర్టు నుంచి సబర్మతి ఆశ్రమానికి వెళ్లిన ప్రధాని అక్కడ బాపూజీకి శ్రద్ధాంజలిఘటించారు. ‘స్వచ్ఛభారత్​ దివస్​’ సభలో మాట్లాడారు.  60 నెలల్లో 60 కోట్ల మందికిపైగా ప్రజలకు టాయిలెట్​ సౌకర్యాన్ని కల్పించాం.  దేశవ్యాప్తంగా 11 కోట్లకుపైగా టాయిలెట్లు నిర్మించాం. మనం చేపట్టిన కార్యక్రమాలను చూసి ప్రపంచం ఆశ్యర్యపోయిందన్నారు.

రూ.150 కాయిన్​

గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా తయారుచేసిన 150 రూపాయల స్మారక నాణేన్ని  ప్రధాని మోడీ విడుదల చేశారు. యునైటెడ్​ నేషన్స్​ కూడా గాందీ పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. గాంధీ పుట్టినరోజును ‘ఇంటర్నేషనల్​ డే ఆఫ్​ నాన్​వయలెన్స్​’గానూ గుర్తించిన నేపథ్యంలో యునైటెడ్​ నేషన్స్(యూఎన్​)తోపాటు ఇతర దేశాల్లోనూ బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి.

పిడికెడు ఉప్పుతో ప్రభంజనం

ఒక వ్యక్తి జాతీయవాదిగా మారకుండా ప్రపంచవాది కాలేడని, ఈ విషయాన్ని గాంధీజీ తన ‘యంగ్​ ఇండియా’ పుస్తకంలో రాశారని ప్రధాని మోడీ చెప్పారు. జాతిపిత 150వ జయంతి సందర్భంగా ఆయన ‘న్యూయార్స్ టైమ్స్‌’లో ప్రత్యేక వ్యాసం రాశారు. మహాత్ముడి ఆలోచనలు, ప్రపంచంపై ఆయన ప్రభావం, గాంధీ గురించి ఐన్‌స్టీన్ చెప్పిన మాటలను ప్రస్తావించారు. అమెరికాలో మార్టిన్​ లూథర్​ కింగ్​, సౌతాఫ్రికాలో నెల్సన్​ మండేలాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని గాంధీజీ ప్రభావితం చేశారని గుర్తుచేశారు. 1930నాటి దండి ఉప్పుసత్యాగ్రహాన్ని ప్రస్తావిస్తూ ‘‘పిడికెడు ఉప్పుతో ప్రభంజనం లాంటి ఉద్యమాన్ని మహాత్ముడే తప్ప ఇంకెవరు చేయగలరని అన్నారు. గాంధీజీనే ప్రపంచానికి గైడింగ్​ లైట్​ అని, బెస్ట్​ టీచరని మోడీ కొనియాడారు.  ‘ఐన్​స్టీన్​ చాలెంజ్​’ పేరుతో  ప్రపంచ వ్యాప్తంగా గాంధీ ఐడియాలజీకి ఇంకా ప్రచారం కల్పిద్దామని సూచించారు.

Ahmedabad: Prime Minister Narendra Modi pays homage to Mahatma Gandhi, on his 150th birth anniversary, at Sabarmati Ashram in Ahmedabad, Wednesday, Oct. 2, 2019. (Twitter/PTI Photo) (PTI10_2_2019_000382B)