రోహిత్​సేన ఖేల్‌ఖతం!

రోహిత్​సేన ఖేల్‌ఖతం!

నావి ముంబై: వయసు పెరిగినా తన ఆటలో వన్నె తగ్గలేదని మహేంద్ర సింగ్‌‌‌‌ ధోనీ (13 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 28 నాటౌట్‌‌‌‌) మళ్లీ నిరూపించాడు.  తనలోని ఫినిషర్‌‌‌‌ను మరోసారి నిద్రలేపాడు. 4 బాల్స్‌‌‌‌లో 16 రన్స్‌‌‌‌ అవసరమైన వేళ 6, 4, 2, 4 తో మ్యాజిక్‌‌‌‌ చేసి ఐపీఎల్‌‌‌‌15లో చెన్నై సూపర్‌‌‌‌ కింగ్స్‌‌‌‌కు రెండో విజయం అందించాడు. మరోవైపు ముంబై ఇండియన్స్‌‌‌‌ కథ మారలేదు. చేతుల్లోకి వచ్చిన విజయాన్ని చేజార్చుకున్న  రోహిత్​సేన లీగ్​లో ఏడో ఓటమి మూటగట్టుకుని ప్లే ఆఫ్స్‌‌‌‌ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. గురువారం రాత్రి ఆఖరి బాల్​ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌‌‌‌లో సీఎస్‌‌‌‌కే 3 వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది. టాస్ ఓడిన ముంబై తొలుత 20 ఓవర్లలో 155/7 స్కోర్ చేసింది. తిలక్ వర్మ (43 బాల్స్ లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 నాటౌట్) ఫిఫ్టీతో అలరించాడు. చెన్నై బౌలర్లలో ముకేశ్ (3/19), బ్రావో (2/36) రాణించారు. అనంతరం ఛేజింగ్ లో చివరి బాల్ వరకు ఆడిన చెన్నై 156/7 స్కోరు చేసి గెలిచింది. అంబటి రాయుడు (35 బాల్స్‌‌‌‌ 2 సిక్సర్లు, 3 ఫోర్లతో 40) రాణించాడు. సామ్స్​ (4/30) నాలుగు వికెట్లు తీశాడు. ముకేశ్​కు ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డు దక్కింది. 

ఆదుకున్న తిలక్

టాపార్డర్ పూర్తిగా విఫలమైనా ముంబై 150 ప్లస్ స్కోరు చేసిందంటే తిలక్ వర్మే కారణం. స్టార్ ప్లేయర్లు తడబడిన  పిచ్​పై ఈ హైదరాబాదీ అద్భుత పెర్ఫామెన్స్ తో హాఫ్ సెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు. ఆ టీమ్​ ఓపెనర్లు రోహిత్ (0), ఇషాన్ కిషన్ (0) ఈ మ్యాచ్ లోనూ ఫెయిలయ్యారు. సీఎస్​కే యంగ్ పేసర్ ముకేశ్ చౌదరి ఖతర్నాక్​ బాల్స్​తో తొలి ఓవర్లోనే ఈ ఇద్దరినీ ఔట్​ చేశాడు. తను వేసిన ఇన్​స్వింగర్​కు రోహిత్​.. మిడాన్​లో శాంట్నర్​కు ఈజీ క్యాచ్​ ఇవ్వగా.. మరో స్వింగింగ్​ యార్కర్​కు క్లీన్​బౌల్డ్​ అయిన ఇషాన్​ కిందపడిపోయాడు. ఇక రెండో ఓవర్లో ధోనీ స్టంప్, జడేజా క్యాచ్ మిస్ చేయడంతో బతికిపోయిన సూర్యకుమార్ (32) కాసేపు దూకుడుగా ఆడాడు. కానీ మళ్లీ బౌలింగ్ కు వచ్చిన ముకేశ్..బ్రేవిస్ (4)ను ఔట్ చేయడంతో  ముంబై 23/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో సూర్యకు తిలక్​ తోడయ్యాడు. ఆరో ఓవర్లో బ్రావో క్యాచ్​ వదిలేయడంతో తిలక్​కు కూడా లైఫ్​ లభించింది. దీన్ని అతను సద్వినియోగం చేసుకున్నాడు. కానీ, కొద్దిసేపటికే సూర్యను శాంట్నర్​ పెవిలియన్​ చేర్చడంతో  56/4తో నిలిచిన ముంబై వంద చేస్తే గొప్పే అనిపించింది. అయితే, ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న హృతిక్ (25)తో కలిసి తిలక్​ ఇన్నింగ్స్​ను గాడిలో పెట్టాడు.  జడేజా ఓవర్లో 6,4తో దూకుడు చూపించిన హృతిక్ 14వ ఓవర్లో వెనుదిరగ్గా.. క్రీజులోకి వచ్చిన పొలార్డ్ (14) వెంటవెంటనే ఫోర్​, సిక్స్​తో స్కోర్ ను వంద దాటించాడు. కానీ, తను ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. పొలార్డ్ తో పాటు సామ్స్ (5) ఔటవగా.. చివర్లో తిలక్, ఉనాద్కత్ (19 నాటౌట్) వేగంగా ఆడి స్కోరు 150 దాటించారు. ఈ క్రమంలో తిలక్​ ఫిఫ్టీ కూడా పూర్తి చేసుకున్నాడు. 

చెన్నై తడబడుతూనే..

ఛేజింగ్‌‌‌‌లో చెన్నైకి కూడా సరైన ఆరంభం దక్కలేదు.  తొలి ఓవర్లోనే గైక్వాడ్ (0)ను ఔట్ చేసి ముంబైకి డేనియల్ సామ్స్ బ్రేక్ ఇచ్చాడు. కాసేపటికే శాంట్నర్ (11) కూడా వెనుదిరగడంతో 16/2తో చెన్నై డిఫెన్స్ లో పడిపోయింది. అనంతరం ఊతప్ప (30), రాయుడు ఇన్నింగ్స్ ను గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. వచ్చీ రాగానే సిక్స్ బాదిన రాయుడు మంచి టచ్ లో కనిపించాడు. ఆ తర్వాత మెరిడిత్ బౌలింగ్ లో రెండు ఫోర్లు కొట్టిన ఊతప్ప టచ్​లో కనిపించాడు. ఈ దశలో బౌలింగ్ కు వచ్చిన ఉనాద్కత్ .. ఊతప్పను పెవిలియన్ పంపి మూడో వికెట్ కు 50 రన్స్ పార్ట్ నర్ షిప్ కు ముగింపు పలికాడు. అనంతరం దూబే (13) ..13వ ఓవర్లో ఔట్ కాగా.. 15వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి రాయుడు క్యాచ్ ఔట్ గా వెనుదిరగడంతో చెన్నై కష్టాల్లో పడింది. అప్పటికి కింగ్స్ కు 30 బాల్స్ లో 53 రన్స్ అవసరం. 16వ ఓవర్లో  కెప్టెన్​ జడేజా (3) పెవిలియన్ చేరడంతో ముంబై విక్టరికీ దగ్గరగా వచ్చింది. అయితే 18వ ఓవర్లో ప్రిటోరియస్ (22) సిక్స్, ధోనీ ఫోర్ బాదడంతో విజయ సమీకరణం 12 బాల్స్ లో 28 రన్స్ గా మారింది. ఇక 19 ఓవర్ వేసిన బుమ్రా 11 రన్స్ ఇవ్వడంతో చివరి ఓవర్ లో చెన్నైకి 17 రన్స్ కావాల్సి వచ్చింది. ఉనాద్కత్ వేసిన ఈ ఓవర్ మొదటి బంతికి ప్రిటోరియస్ ఔటైనా ధోనీ ధనాధన్​ షాట్లతో చెన్నైని గెలిపించాడు.