
కుటుంబంలోని వ్యక్తికి ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది కలిగితే జీర్ణించుకోవడం చాలా కష్టం. అలాంటిది వాళ్లలో ఎవరినైనా కోల్పోతే ఆ బాధను మాటల్లో చెప్పలేం. అలాంటిదే సినీనటుడు మహేష్ బాబుకు జరిగింది. ఈ ఏడాదిలో కొన్ని నెలల వ్యవధిలోనే కుటుంబ సభ్యుల్లో ముగ్గురు మృతిచెందడంతో మహేష్ తీరని దుఃఖంలోకి వెళ్లిపోయారు.
ఈ ఏడాది జనవరి 8వ తేదీన మహేష్ బాబు అన్న రమేష్ బాబు కాలేయ వ్యాధితో మరణించారు. ఆ బాధ నుంచి కోలుకుంటున్న సమయంలోనే మహేష్ తల్లి ఇందిరాదేవి సెప్టెంబర్ 28వ తేదీన ఆరోగ్య సమస్యలతో చనిపోయారు. తల్లిని కోల్పోయిన బాధ నుంచి తేరుకునే లోపే మరో చేదువార్త ఘట్టమనేని ఫ్యామిలీని మరింత విషాదంలోకి నెట్టేసింది. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు మహేష్ బాబు.. తమ తండ్రి కృష్ణను కోల్పోయారు.
ఈ కష్టకాలంలో మహేష్ బాబుకు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులతో పాటు అభిమానులు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ‘నీకు మేం ఉన్నాం’ అని ధైర్యాన్ని పంచుతున్నారు.