పోకిరి రోజులు గుర్తొచ్చాయి

పోకిరి రోజులు గుర్తొచ్చాయి

మహేష్‌‌ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌‌‌‌టైన్మెంట్స్ సంస్థలు కలిసి నిర్మించాయి. ఈనెల 12న సినిమా విడుదల కానున్న సందర్భంగా నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు సుకుమార్  ఈ సినిమాలోని స్పెషల్  సాంగ్‌‌ని రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ఇందులో మహేష్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు.  ఇంత జోవియల్‌‌గా, ప్లేఫుల్‌‌గా ఆయన్ను ఇప్పటివరకు చూడలేదు. మహేష్‌‌తో సినిమా చేస్తున్నప్పుడు సెట్‌‌లో డైరెక్టర్ కింగ్‌‌లా ఉంటాడు. అంతలా దర్శకుడికి కాన్ఫిడెన్స్ ఇస్తాడు. ఈ  ట్రైలర్ చూసిన దగ్గర్నుంచి ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఎదురుచూస్తున్నాను. ఇప్పుడున్న వాళ్లలో  వన్ ఆఫ్‌‌ ద బెస్ట్ డైలాగ్ రైటర్ పరశురామ్. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నా’ అన్నారు.  దర్శకులు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, మెహర్ రమేష్,  గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు సాన,  హీరోలు అడివి శేష్, సుధీర్ బాబు, అశోక్ గల్లా, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు మూవీ టీమ్‌‌కి బెస్ట్ విషెస్ చెప్పారు.  ‘కళావతిగా నన్ను ఊహించుకున్నందుకు పరశురామ్‌‌ గారికి థ్యాంక్స్. మహేష్‌‌ గారితో షూటింగ్‌‌ ఉన్నప్పుడు ఆయన టైమింగ్‌‌ను ఎలా మ్యాచ్ చేయాలా అని టెన్షన్ ఉండేది. డబ్బింగ్‌‌లో సినిమా చూసినప్పుడు తన పక్కన గ్లామర్‌‌‌‌ విషయంలో మ్యాచ్ అయ్యానా లేదా అని టెన్షన్. కానీ ఆయనతో వర్క్ చేయడం మాత్రం సూపర్ హ్యాపీ’ అంది కీర్తి సురేష్.​  పరశురామ్ మాట్లాడుతూ ‘కొరటాల శివన్న హెల్ప్‌‌తోనే మహేష్‌‌ గారికి కథ చెప్పాను. నన్ను ఇంత నమ్మినందుకు ఆయనకి నా జీవితమంతా థ్యాంక్స్ చెప్పినా తక్కువే. టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు’ అన్నారు.  ‘మహేష్ గారిని ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటారో దానికి రెండితంలు ఈ సినిమా ఉంటుంది. ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గదు’ అన్నారు చిత్ర నిర్మాతలు నవీన్ యేర్నేని, రవి శంకర్,  రామ్ ఆచంట, గోపీ ఆచంట. సముద్రఖని,  తమన్, అనంత శ్రీరామ్, ఫైట్ మాస్టర్స్ రామ్,లక్ష్మణ్  పాల్గొన్నారు. 

పోకిరి రోజులు గుర్తొచ్చాయి : మహేష్​

‘‘రెండేళ్ల తర్వాత మళ్లీ అందరినీ ఇలా చూడటం ఆనందంగా ఉంది. నా క్యారెక్టర్‌‌‌‌ను చాలా ఎక్స్‌‌ట్రార్డినరీగా డిజైన్ చేశారు పరశురామ్. నా ఫేవరేట్‌‌ క్యారెక్టర్స్‌‌లో ఇదీ ఒకటి. నా డైలాగ్ మాడ్యులేషన్, మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ లాంటివన్నీ ఆయన డిజైన్ చేసినవే. చాలా ఎంజాయ్‌‌ చేస్తూ ఈ సినిమాకు వర్క్ చేశాను. కొన్ని సీన్స్‌‌ చేస్తుంటే ‘పోకిరి’ రోజులు గుర్తొచ్చాయి. ఇలాంటి సినిమా ఇచ్చినందుకు పరశురామ్‌‌కు థ్యాంక్స్. ఇందులో చాలా హైలైట్స్ ఉంటాయి. హీరోహీరోయిన్‌‌ ట్రాక్‌‌ అందులో వన్‌‌ ఆఫ్‌‌ ద హైలైట్. ఈ ట్రాక్‌‌ కోసమే రిపీట్ ఆడియెన్స్‌‌ ఉంటారు. కీర్తి పర్‌‌‌‌ఫార్మెన్స్‌‌, క్యారెక్టరైజేషన్ సర్‌‌ప్రైజింగ్‌గా ఉంటుంది. అంత అద్భుతంగా నటించింది. తమన్ మ్యూజిక్.. యూత్, క్లాస్‌‌, మాస్‌‌ అందరికీ కనెక్ట్ అవుతోంది. అతని బ్యాగ్రౌండ్‌‌ మ్యూజిక్‌‌కు నేను ఫ్యాన్‌‌ని. టెక్నికల్ టీమ్ అందరికీ థ్యాంక్స్. ఈ రెండేళ్లలో చాలా జరిగాయి, చాలా మారాయి. నాకు బాగా దగ్గరైన వాళ్లు దూరమయ్యారు. ఏది జరిగినా, ఏది మారినా మీ అభిమానం మాత్రం మారలేదు. ఇది చాలు ధైర్యంగా ముందుకు వెళ్లడానికి. మీ అందరికీ నచ్చే సినిమా రాబోతోంది. మళ్లీ మనందరికి పండగే’’.