హైదరాబాద్ లో కృష్ణ మెమోరియల్ ఏర్పాటుకు మహేశ్ ప్లాన్

హైదరాబాద్ లో కృష్ణ మెమోరియల్ ఏర్పాటుకు మహేశ్ ప్లాన్

సూపర్ స్టార్ కృష్ణ గుర్తుగా మెమోరియల్ ఏర్పాటు చేయాలని ఆయన కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఆ దిశగా కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ మెమోరియల్ లో కృష్ణకు సంబంధించిన అవార్డులు, షీల్డ్ లు ఇంకా ఆయనకు నచ్చిన అనేక వస్తువులు ఉంచనున్నారు. కృష్ణ నటించిన 350 సినిమాల్లో కీలకమైన పాత్రల లైఫ్ సైజ్ ఫొటోలు అక్కడ ప్రదర్శనకు అనుకూలంగా ఫిక్స్ చేయనున్నారు.

అలాగే కృష్ణ స్మారక చిహ్నం ఏర్పాటుకు కూడా కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు కృష్ణ ఘాట్ ఏర్పాటు చేసే యోచనలో వారు ఉన్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ లెజండరీ నటుడికి కూడా ఇలాంటి మెమోరియల్ లేదు.ఇప్పుడు కృష్ణ కోసం కుటుంబ సభ్యులు స్మారక మందిరం ఏర్పాటు చేసి అభిమానుల సందర్శనార్థం ఉంచితే మంచి ఆలోచనే అవుతుంది అంటున్నారు. పద్మాలయా స్టూడియోస్ వద్ద కృష్ణ మెమోరియల్ ను ఏర్పాటు చెయ్యొచ్చని అంటున్నారు.

సూపర్‌స్టార్‌ కృష్ణ కన్నుమూతతో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం ఉదయం కృష్ణ తుది శ్వాస విడిచిన అనంతరం కుటుంబసభ్యులు, అభిమానుల సందర్శన తర్వాత బుధవారం మధ్యాహ్నం అంతిమ సంస్కారాలు నిర్వహించారు.