- గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసింది: మహేశ్ గౌడ్
- పదవుల కోసం బీఆర్ఎస్ నేతలు కొట్టుకుంటున్నరు
- అలాంటి పార్టీలోకి జీవన్‌రెడ్డి వెళ్లి తప్పు చేశారన్న పీసీసీ చీఫ్
- ములుగులో డీసీసీ కార్యవర్గ ప్రమాణ కార్యక్రమానికి హాజరు
ములుగు, వెలుగు: తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వంద స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించారని, రూ.8 లక్షల కోట్లు అప్పులు మిగిల్చారని విమర్శించారు. ములుగులోని లీలా గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని డీసీసీ కార్యవర్గంతో ప్రమాణం చేయించారు. అనంతరం మాట్లాడుతూ.. వందేండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఉండడం గర్వంగా ఉందన్నారు. ఎక్కడైనా పార్టీలే శాశ్వతం.. ప్రభుత్వాలు వచ్చి పోతుంటాయన్నారు. కార్యకర్తలు, నాయకులు కలిస్తేనే తాము పదవుల్లో ఉన్నామన్నారు.
గతంలో హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, బోనస్, గిరిజన యూనివర్సిటీ, నర్సింగ్, మెడికల్ కాలేజీ, ఎత్తిపోతలకు రూ.143 కోట్లు, దేవాదుల ప్రాజెక్ట్ కోసం రూ.650 కోట్లు ఇచ్చామని చెప్పారు. మోదీ, అమిత్ షా పదవులే పరమావధిగా పనిచేస్తుంటే.. సోనియా, రాహుల్‌గాంధీలు పదవులను తృణప్రాయంగా వదిలేశారన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్ట్‌లు ఇప్పటికీ చెక్కుచెదరలేదని, కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం అప్పుడే కూలిపోయిందన్నారు.
కల్వకుంట్ల కవిత బాహాటంగానే బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్న బీజేపీ నేతలు.. పన్నెండున్నరేండ్లలో రాష్ట్రానికి ఏం తెచ్చారని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం ప్రభుత్వం నోటికాడి బుక్కను తొక్కిపెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు తెలంగాణను నిర్మాణం చేసే దిశగా ముందుకు పోతున్నామని, కార్యకర్తలు, లీడర్లు ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తూ తమ విజన్‌లో లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు గట్టమ్మ ఆలయం వద్ద మంత్రి సీతక్క, ఎంపీ పోరిక బలరాంనాయక్, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్.. పీసీసీ చీఫ్‌కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మహేశ్‌కుమార్‌గౌడ్ గట్టమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరతాననడం బాధాకరం
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి అధ్యాయం ముగిసిందని, మాజీ సీఎం కేసీఆర్‌పై తమకన్నా ఎక్కువ విమర్శలు చేసిన ఆయన తిరిగి అదే పార్టీలోకి వెళ్లడం బాధాకరమని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై జీవన్ రెడ్డి స్పష్టతతో కూడిన విమర్శలు చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ముక్కలైందని, ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారని పేర్కొన్నారు.
