
- దేశంలోనే తొలిసారిగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు
- గత ఫిబ్రవరిలో ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
- రోజుకు 10 వేల లీటర్ల పెట్రోల్, డీజిల్ అమ్మకాలు
మహబూబ్‌నగర్, వెలుగు: నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటైన దేశంలోనే మొట్టమొదటి మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ లాభాల్లో దూసుకుపోతోంది. ఈ బంక్ ద్వారా ఆరు నెలల్లో రూ. 15.50 లక్షల ఆదాయాన్ని జిల్లా మహిళా సమాఖ్య ఆర్జించింది. నారాయణపేటలో మహిళా సమాఖ్య పెట్రోల్‌బంకును ఈ ఏడాది ఫిబ్రవరి 21న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ బంకులో 35 వేల లీటర్ల (పెట్రోల్, డీజిల్) నిల్వ సామర్థ్యం ఉంది. మొదట్లో రోజుకు వెయ్యి లీటర్ల నుంచి రెండు వేల లీటర్ల వరకు డీజిల్, పెట్రోల్ అమ్ముడుపోయేది.నిర్వహణ బాగా ఉండడంతో కొద్ది నెలలుగా బిజినెస్ పెరిగింది.
ప్రస్తుతం రోజుకు 4 వేల లీటర్ల పెట్రోల్, 6 వేల లీటర్ల డీజిల్ వ్యాపారం జరుగుతోంది. ప్రతి నెలా లక్షల్లో ఆదాయం వస్తుండగా.. ఇప్పటివరకు ఆరు నెలల్లో రూ.15.50 లక్షల ఆదాయం వచ్చింది. ఈ బంకు నిర్వహణతో వచ్చే కమీషన్ జిల్లా సమాఖ్యకు చేరుతుంది. దీనికి అదనంగా ప్రతినెలా రూ.10 వేలు బీపీసీఎల్ కంపెనీ మహిళా సమాఖ్యకు అందిస్తోంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంలో భాగంగా 'ఇందిరా మహిళా శక్తి పాలసీ'ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పాలసీ కింద మహిళా సమాఖ్య, మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదిగేందుకు సహకారం అందిస్తున్న సర్కారు.. ఇప్పటికే 'అమ్మ ఆదర్శ పాఠశాల'ల నిర్వహణ, బడి పిల్లలకు స్కూల్ యూనిఫాం కుట్టే బాధ్యత, గవర్నమెంట్ఆఫీసుల్లో మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్‌పవర్ ప్లాంట్ల బాధ్యతలను మహిళలకు అప్పగించింది.
రెండేళ్ల కిందటే కార్యాచరణ..
నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య సభ్యులతో రెండేళ్ల కిందట అప్పటి కలెక్టర్ కోయ శ్రీహర్ష సమావేశం అయ్యారు. మహిళా సమాఖ్య అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, సమాఖ్య ఆర్థికంగా వెనుకబడి ఉండడంతో పెట్రోల్ బంక్ నిర్వహణ గురించి వారికి పలు సూచనలు చేశారు. ఇందుకు సభ్యులూ ఒప్పుకోవడంతో ప్రభుత్వ భూమి కోసం అన్వేషించారు. కానీ ఆయన ట్రాన్స్ఫర్కావడంతో ఆశ వదులుకున్నారు. అనంతరం వచ్చిన కలెక్టర్సిక్తా పట్నాయక్ వారి కలలను సాకారం చేశారు. పెట్రోల్ బంక్ నిర్వహణ గురించి కలెక్టర్ దృష్టికి సభ్యులు తీసుకెళ్లగా.. ఆమె ప్రోత్సహించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తా సమీపంలో డీఆర్డీఏ ఆఫీసును ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని డీఆర్డీఏ, జడ్ఎంఎస్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. భారత్పెట్రోలియం కార్పొరేషన్లిమిటెడ్(బీపీసీఎల్) కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు ఆ సంస్థ రూ.1.30 కోట్లు వెచ్చించింది. కలెక్టర్ సహకారంతో పెట్రోల్ బంకును ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు.
బంకులో ఉమెన్ మేనేజర్,సేల్స్ ఉమెన్స్..
పెట్రోల్ బంక్ నిర్వహణకు సంబంధించిన 11 మంది మహిళలకు ముందస్తుగా జడ్చర్ల, షాద్‌నగర్‌లోని పెట్రోల్ బంకుల్లో మేనేజర్, సేల్స్ ఉమెన్లుగా ప్రభుత్వం ట్రైనింగ్ఇప్పించింది. ఈ 11 మందిలో ఒకరు మేనేజర్‌గా, మిగతా వారు సేల్స్ఉమెన్లుగా పని చేస్తున్నారు. వీరిలో సేల్స్ఉమెన్కు నెలకు రూ.13,200, మేనేజర్ కు రూ.18 వేల జీతం ఇస్తున్నారు. అలాగే ఓ మహిళా స్వీపర్ కూడా ఉన్నారు. అయితే, క్వాలిటీ మెయింటెన్ చేస్తుండడంతో 24 గంటలపాటు బంకును ఓపెన్ చేయాలని కస్టమర్ల నుంచి డిమాండ్వస్తోంది. ఈ క్రమంలో రాత్రిళ్లు సేల్స్ ఉమెన్లకు బదులు సేల్స్బాయ్స్ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇంకో బిజినెస్ స్టార్ట్ చేస్తాం..
పెట్రోల్ బంకు నిర్వహిస్తామని కలలో కూడా అనుకోలేదు. దీనితో మాకు నెలనెలా జీతాలు వస్తున్నాయి. ఆ జీతాలు మా కుటుంబాలకు ఎంతో ఆసరా అవుతున్నాయి. ఆరు నెలల్లో రూ.15.50 లక్షల ఆదాయం వచ్చింది. ఈ డబ్బుతో మరో బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నాం. మహిళాశక్తి టీ పాయింట్స్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. అందరితో చర్చించాక ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. మహిళా సమాఖ్య ద్వారా దేశంలోనే నడుస్తున్న ఏకైక పెట్రోల్ బంకు మాదే కావడం ఆనందంగా ఉంది. ఇందుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు.
చంద్రకళ, పెట్రోల్ బంకు మేనేజర్