ఇందూరులో..ఎలాగైనా గెలవాలని

ఇందూరులో..ఎలాగైనా గెలవాలని
  •    ముఖ్య నేతల మీటింగ్​లతో  కోలాహలం
  •     ఈ రోజు  సీఎం రేవంత్​రెడ్డి సభ
  •     మే ఫస్ట్​ వీక్​లో ఆర్మూర్​కు రాహుల్, ప్రియాంక..మీటింగ్​కు సన్నాహాలు
  •     అర్వింద్ తరఫున 25న సెంట్రల్​ రైల్వే మినిస్టర్​ అశ్వినీ వైష్ణవ్​ రాక
  •     బీజేపీ నుంచి ప్రధాని మోదీ లేదా అమిత్​షా టూర్​
  •     మే 6న బీఆర్​ఎస్​ చీఫ్​  కేసీఆర్​ సభ..  
  •      కేటీఆర్​..హరీశ్ ​రావు కార్నర్​ మీటింగ్​లు

నిజామాబాద్​, వెలుగు :  నిజామాబాద్​ పార్లమెంట్​ స్థానాన్ని ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలు స్పెషల్​ ఫోకస్​ పెట్టాయి.  ఓటర్ల ఆదరణతో గట్టెక్కే ప్రయత్నాలు చేస్తున్నాయి.  అభ్యర్థుల పోటాపోటీ ప్రచారాలను మరింత హోరెత్తించడానికి ముఖ్య నేతలు రంగంలో దిగనున్నారు. రానున్న 15 రోజులు క్యాంపెనింగ్  లీడర్ల టూర్లతో కోలాహలంగా మారనుంది.  పార్టీ క్యాడర్​లో జోష్​ పెంచేలా లీడర్లు ప్లాన్​ చేసుకున్నారు.  కాంగ్రెస్​ అభ్యర్థి టి.జీవన్​రెడ్డి తరఫున సోమవారం సీఎం రేవంత్​రెడ్డి ప్రచారానికి రానుండగా మే మొదటి వారంలో ఆగ్రనేతలు రాహుల్​ లేదా ప్రియాంకతో సభ పెట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు.  

25న బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ ప్రచారానికి సెంట్రల్​ రైల్వే మినిస్టర్​ అశ్విన్​ వైష్ణవ్​  ప్రొగ్రాం ఫిక్స్​ అయింది. ప్రధాని మోదీ లేదా కేంద్ర హోం మంత్రి అమిత్​షా​ వచ్చే ప్లాన్ చేసుకుంటున్నారు. మే 6న బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ టూర్​ కూడా కన్ఫర్మ్ అయింది. అంతకు ముందు కేటీఆర్, హరీశ్ ​రావు రానున్నారు. 

ఛాలెంజ్​గా తీసుకున్న కాంగ్రెస్​

ఇందూర్​ పార్లమెంట్ లో  గెలుపును కాంగ్రెస్​ సవాల్​గా తీసుకుంది.  పాజిటివ్​గా ఉన్న పరిస్థితులను మరింత మెరుగుపర్చుకోవడానికి కృషి చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో అన్ని విలేజ్​లలో ప్రచారం చేయడం సాధ్యం కానందున ప్రత్యేక పంథాను ఎంచుకొంది. పార్లమెంట్​ సెగ్మెంట్​లో 750కు మించి గ్రామాలుండగా అన్నీ కవర్​ అయ్యేలా రెండు స్టేట్​ లెవల్​, ఒకటి సెంట్రల్​ పార్టీ సభ నిర్వహించే ప్లాన్​ చేశారు.   అందులో భాగంగా స్టేట్​ పార్టీ కమిటీ తరఫున మొదట సీఎం రేవంత్​రెడ్డి వస్తున్నారు. అభ్యర్థి జీవన్​రెడ్డి నామినేషన్​ వేయనున్న సందర్భంగా రేవంత్​రెడ్డి టూర్​ కన్ఫర్మ్​ అయింది.  

ర్యాలీ, సభ కోసం పార్లమెంట్​ సెగ్మెంట్​ లెవల్​లో జనసమీకరణ చేస్తున్నారు. కాంగ్రెస్​  ప్రచార కమిటీ చైర్మన్​ మధుయాష్కీగౌడ్​ తల్లి అనసూయ దినకర్మ ఈనెల 25న ఉంది. ఆ కార్యక్రమం ముగియగానే ఆయన కూడా ప్రచారంలోకి  రానున్నారు. జిల్లా ఇన్​ఛార్జ్​ మంత్రి జూపల్లి కృష్ణారావుకు  బాధ్యతలు అప్పగించారు. సెంట్రల్​ కమిటీ తరఫున ఆర్మూర్​లో భారీ బహిరంగ సభను మే మొదటి వారంలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ లీడర్లతో కలిసి అభ్యర్థి జీవన్​రెడ్డి రోడ్​షో, కార్నర్​ మీటింగ్​లతో వీలైనన్నీ గ్రామాలు చుట్టేసేలా మున్ముందు ప్రచారం కార్యక్రమాలు డిజైన్​ చేశారు. 

పరువు నిలబెట్టుకోవాలని బీఆర్​ఎస్​

కాంగ్రెస్​, బీజేపీ ముఖ్య నేతల సభల నేపథ్యంలో బీఆర్​ఎస్​ చీఫ్​ కేసీఆర్​ టూర్​ కూడా కన్ఫర్మ్ అయింది. ఎన్నికల్లో కనీసం పరువు నిలబెట్టుకునే స్థానాలు గెలుపొందేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మే 6న బస్​ యాత్రతో ఇందూర్​ వస్తున్నట్లు కేసీఆర్​ షెడ్యుల్​ విడుదలైంది. రోజంతా ఆయన ఇక్కడే ఉండి రాత్రి కూడా ఇక్కడే బస చేయనున్నారు. 

స్థానం పదిలం చేసుకోడానికి బీజేపీ

పార్లమెంట్​ స్థానంలో మరోసారి జెండా ఎగరేయాలని భావిస్తున్న బీజేపీ ఆ మేరకు వ్యూహాలు రచిస్తోంది.  రెండోసారి పోటీ చేస్తున్న  సిట్టింగ్​ ఎంపీ అర్వింద్​ తన స్థానం సుస్థిరం చేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈనెల 19న పసుపు రైతులతో వెళ్లి సాదాసీదాగా ఒక  సెట్​ నామినేషన్​ వేసిన అర్వింద్​ 25 న మరో సెట్​ నామినేషన్​ వేయనున్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ, సభకు ఏర్పాట్లు చేశారు.

సెంట్రల్​ రైల్వే మినిస్టర్​ అశ్విన్​ వైష్ణవ్​ దీనికి అటెండ్​ కానున్నారు. ప్రధాని మోదీ అక్టోబర్​ 3న  ఒకసారి నిజామాబాద్​ వచ్చారు. 15 రోజుల కింద పార్లమెంట్​ సెగ్మెంట్​ పరిధిలోని జగిత్యాలకు వచ్చి ప్రచార సభలో పాల్గొన్నారు.  ఇందూర్​ గడ్డపై మరో ప్రచార సభకు ప్రధాని మోదీ ఓకే చెప్పగా ఇంకా డేట్​ ఫిక్స్​ కాలేదు. ఒకవేళ ఆయన రాలేని పక్షంలో హోం మంత్రి అమిత్​షా సభ పక్కాగా ఉంటుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.